తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు రైలు ప్రమాదంపై NIA దర్యాప్తు- కుట్ర జరిగిందా?

తమిళనాడు రైలు ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు- కుట్ర కోణంలో ఎన్ఐఏ విచారణ- కేంద్రంపై రాహుల్ ఫైర్​

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Tamilnadu Train Accident
Tamilnadu Train Accident (ETV Bharat)

Tamilnadu Train Accident Probe : తమిళనాడులో భాగమతి ఎక్స్​ప్రెస్​ రైలు ప్రమాద ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టింది. శనివారం ఉదయం ఘటనాస్థలికి ఎన్​ఐఏ అధికారులు వెళ్లి పరిశీలించారు. చెన్నై సమీపంలోని పొన్నేరి ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రైలు పట్టాలపై దుండగులు వేసిన వైర్లు, సిగ్నల్ బోర్డులపై పెట్టిన హుక్స్​ను గుర్తించి రైల్వే సిబ్బంది గుర్తించి సరిచేశారు. అప్పుడే కుట్ర జరిగి ఉంటుందనే అనుమానంతో ఇప్పుడు ఎన్​ఐఏ అధికారులు విచారణ చేపట్టారు.

తమిళనాడు రైలుప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ RN సింగ్‌ తెలిపారు. సిగ్నల్‌, మార్గం మధ్య మిస్‌ మ్యాచ్‌ ప్రమాదానికి కారణమైందని అన్నారు. మెయిన్‌ లైన్‌లోకి వెళ్లేలా సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ట్రాక్‌ మాత్రం రైలును క్లోజ్డ్‌ లూప్‌ వైపు మళ్లించిందని వెల్లడించారు. ఎక్కడో జరిగిన తప్పు కారణంగానే గూడ్స్‌ రైలు ఆగి ఉన్న ట్రాక్‌ పైకి ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లినట్లు దక్షిణ రైల్వే జీఎం తెలిపారు. అయితే కచ్చితంగా ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుందన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు (ETV Bharat)

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రైల్వే భద్రతా విభాగానికి చెందిన సీనియర్‌ అధికారుల బృందం సందర్శించింది. అక్కడి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించింది. ట్రాక్‌తోపాటు పాయింట్లు, బ్లాక్స్‌, సిగ్నళ్లను, స్టేషన్‌లోని ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం, కంట్రోల్‌ ప్యానల్స్‌, భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలను రైల్వే భద్రతా విభాగం అధికారులు పరిశీలించారు.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు (ETV Bharat)

జవాబుదారీతనం పైస్థాయి నుంచే ఉండాలి: రాహుల్​
రైలు ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాలేశ్వర్ ప్రమాదానికి అద్దం పడుతోందన్న రాహుల్, వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా వాటి నుంచి గుణపాఠాలు నేర్వలేదని కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. జవాబుదారీతనం పైస్థాయి నుంచే ఉండాలన్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు బలి కావాలని? ఎక్స్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు.

అసలేం జరిగిందంటే?
మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు వేగంగా వచ్చి తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రీ ఢీకొంది. 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులెవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details