Tamil Nadu Train Accident :తమిళనాడులో శుక్రవారం రాత్రి భారీ రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొంది. దీనితో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
ఈ నేపథ్యంలో దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము, పుదుచ్చేరి-తిరుపతి మెము, డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్(పలు రైళ్లు), తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(పలు రైళ్లు), అరక్కం-పుదుచ్చేరి మెము, కడప-అరక్కోణం మెము, డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము, తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము, అరక్కోణం-తిరుపతి మెము, తిరుపతి-అరక్కోణం మెము, విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్, నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.
రద్దు అయిన ట్రైన్స్ లిస్ట్ ఇదే! (ETV Bharat)
ఇదీ జరిగింది!
తమిళనాడులో శుక్రవారం రాత్రి భారీ రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీనితో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. సమీప గ్రామాల్లోని ప్రజలు, వివిధ శాఖల సహాయక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును ఢీకొన్నప్పుడు ముందు భాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
హెల్ప్‌లైన్ నంబర్స్
చెన్నై రైల్వే డివిజన్ 044 2535 4151, 044 2435 4995 ఫోన్ నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.
మళ్లీ అదే తప్పు జరిగింది!
గతేడాది ఒడిశా పరిధిలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మృతి చెందారు. అప్పట్లో గ్రీన్ సిగ్నల్స్ పడటం, రైలు ట్రాక్ మారడం వంటి తప్పిదాలు జరిగాయి. సరిగ్గా అదే తీరులో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రాత్రి 8.27 సమయంలో ఈ రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడం, ఆ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో రైలు వేగం గంటకు 75 కి.మీ. ఉన్నట్లు తెలిపారు. గూడ్స్ రైలును వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల భాగమతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకోతో పాటు సుమారు 12, 13 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇంజిన్ తర్వాత ముందు భాగంలో లగేజీ కోచ్ ఉంది. దాని తరువాత వరుసగా 10 ఏసీ కోచ్‌లు ఉన్నాయి. అందువల్ల ఏసీ కోచ్‌ల్లోని ప్రయాణికులు గాయాలపాలు అయ్యారు. ప్రయాణికులున్న హెచ్1, ఏ2 కోచ్‌లు ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు వైపు వెళ్లే ప్రధాన మార్గంలోని పట్టాల పైకి ఎగిరి పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి.
అందరూ సురక్షితం: రైల్వే
భాగమతి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గాయపడినవారిని సమీపంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బయటపడిన వారికి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
స్పెషల్ ట్రైన్
భాగమతి ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్ తర్వాత అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాడు చేశారు. చెన్నై సెంట్రల్ నుంచి శనివారం ఉదయం 4.45 గంటలకు ఈ ప్రత్యేక రైలు బయలుదేరింది.