తమిళనాట మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేను గద్దె దించే వరకు శపథం చేసిన ఆయన, ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించనని గురువారం తెలిపారు. తాజాగా ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. అసలు ఏం జరుగుతోందంటే?
Annamalai Whips Himself :చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, దీనికి అధికార డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో అన్నామలై డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతినబూనారు.
"డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను. చెప్పులు లేకుండానే నడుస్తా. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపం. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం. విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించను. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలు దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడతాను. కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటాను" అని అన్నామలై గురువారం తెలిపారు.