Stay Petition On CAA Supreme Court : పౌరసత్వ సవరణ చట్టం-CAA అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మూడువారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే, విచారణ పూర్తయ్యే దాకా చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.
కేంద్ర తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టం ఏ వ్యక్తి పౌరసత్వాన్ని తొలిగించదని ధర్మాసనానికి తెలిపారు. 200 దరఖాస్తులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కావాలని మెహతా సుప్రీంకోర్టును కోరారు. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం 2019లో పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే ఆ తర్వాత సీఏఏను సవాల్ చేస్తూ అప్పట్లోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడం వల్ల ఆ చట్టం అమల్లోకి రాలేదని కేంద్రం నాడు న్యాయస్థానానికి వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటీవల పౌరసత్వ సవరణ నిబంధనలు-2024ను సర్కారు నోటిఫై చేయడం వల్ల చట్టం అమలులోకి వచ్చింది. దీంతో ఈ అంశం మళ్లీ కోర్టుకు చేరింది.