Specially Abled Food Delivery Agents in Guwahati: అసోంలోని గువాహటి వీధుల్లో తిరిగేవారికి అన్వర్ హుస్సేన్, సత్తార్ అలీ, సమ్సుల్ హక్ అనే వ్యక్తులు ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటారు. ఆ ముగ్గురి జీవిత ప్రయాణం తెలియక పోయినా, వారిని చూసిన వెంటనే ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ఆశ్చర్యపడిన వారు ఎందరో. కారణం, వారు ముగ్గురు దివ్యాంగులు. వైకల్యం ఉందని, తాము ఏమీ చేయలేమని నిస్సహాయతతో అక్కడే ఆగిపోలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించారు. మనిషి సంకల్ప శక్తి, మనో బలంతో ఇలా కూడా చేయచ్చా అని అందరూ ఆశ్చర్యపడేలా డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
7ఏళ్ల పాటు మంచంపైనే!
అసోంలోని బిలాసిపరా గ్రామానికి చెందిన అన్వర్ హుస్సేన్ పని కోసం గువాహటికి వచ్చాడు. 2015లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సుమారు 7ఏళ్ల పాటు ఆసుపత్రిలో మంచంపై ఉన్న అన్వర్ ఎవరిపై ఆధార పడకూడదని నిర్ణయించుకున్నాడు. అనంతరం ఫుడ్ డెలివరీ బాయ్‌గా స్విగ్గీలో చేరాడు. తన ట్రైసైకిల్‌పైనే చాలా మందికి ఫుడ్‌ను సరఫరా చేస్తున్నాడు. దీంతో ఆదాయాన్ని సంపాదిస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు. అయితే తాను గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు అన్వర్ తెలిపాడు. కానీ ఇప్పుడు మనోధైర్యంతో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.