Siddaramaiah MUDA Scam Case :ముడా స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఉత్తర్వులు ఇచ్చింది. మూడు నెలల్లోగా ముడా స్కామ్‌పై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ముడా స్కామ్‌లో సీఎంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ స్నేహమయి కృష్ణ- ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జడ్జి సంతోష్ గజానన్ భట్, దర్యాప్తు చేసి డిసెంబర్ 24 నాటికి నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించిన మరుసటి రోజే జడ్జి సంతోష్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
లోకాయుక్త దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు పిటిషనర్ స్నేహమయి కృష్ణ తరపున న్యాయవాది లక్ష్మీ అయ్యంగార్ అన్నారు. "కోర్టు ఆదేశాల ప్రకారం వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. మేము ఇంతకంటే ఏమీ ఆశించడం లేదు. దర్యాప్తులో నిజమే గెలుస్తుందని ఆశిస్తున్నా. పోలీసులు సాక్ష్యాల కోసం వెతకాల్సిన అవసర లేదని భావిస్తున్నా. ఎందకుంటే మేము అందించిన పత్రాలు, సాక్ష్యాలు అన్ని సమగ్రంగా ఉన్నాయని అనుకుంటున్నా" అని లక్ష్మీ తెలిపారు.
'నేను సిద్దం'
ముడా స్కామ్‌లో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. 'దర్యాప్తు విషయంలో నేను భయపడడం లేదు. ప్రత్యేక కోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటా' అని సిద్ధరామయ్య తెలిపారు.
ఇదీ కేసు
అభివృద్ధి కోసం సిద్ధరామయ్య భార్య బీఎమ్ పార్వతికి చెందిన భూములు తీసుకున్న ముడా అందుకు బదులుగా చట్టవిరుద్ధంగా మైసూరులోని పలు ప్రాంతాల్లో 14 చోట్ల స్థలాలు కేటాయిచిందింది. సీఎం ఆదేశాల మేరకు ఆయన భార్యకు విలువైన స్థలాలను ముడా కేటాయించిందని ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఏడు రోజుల్లోగా ముడా స్కామ్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశిస్తూ గత నెల సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాంతో విచారణకు అనుమతించవద్దని ఆదేశిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.