Credit Card Loan Vs Personal Loan : ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో ఎవరమూ చెప్పలేము. ఇలాంటి సమయంలో సాధారణంగా అప్పులు చేస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు రుణాలు విరివిగానే అందిస్తున్నాయి. వీటిని మీరు ఉపయోగించుకుని మీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు రుణం/ వ్యక్తిగత రుణాల మధ్య వ్యత్యాసం ఏమిటి? వీటిలో ఏది మంచి ఛాయిస్ అవుతుంది? అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
దరఖాస్తు ప్రక్రియ
- క్రెడిట్ కార్డ్ లోన్ : మీ దగ్గర ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉంటే, బ్యాంకు దగ్గర ఇప్పటికే మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి. కనుక అదనపు డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు.
- పర్సనల్ లోన్ : వ్యక్తిగత రుణం కావాలంటే, కచ్చితంగా మీ ఆదాయ రుజువులు, ఇతర డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
రుణ మొత్తం
- క్రెడిట్ కార్డ్ లోన్ : తక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోవడం మంచిది.
- పర్సనల్ లోన్ : పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు, బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది.
రుణ వ్యవధి
- క్రెడిట్ కార్డ్ లోన్ : మీ క్రెడిట్ కార్డుల ద్వారా లభించిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి సాధారణంగా 12 నెలల నుంచి 36 నెలల వ్యవధి ఉంటుంది.
- పర్సనల్ లోన్ : సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణాలను తీర్చడానికి 12 నెలల నుంచి 60 నెలల వరకు వ్యవధిని ఇస్తాయి.
అదనపు ఖర్చులు
- క్రెడిట్ కార్డ్ లోన్ : క్రెడిట్ కార్డ్ రుణాలపై అధిక వడ్డీని వసూలు చేస్తారు. దీనికి తోడు ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ అర్హతలను బట్టి బ్యాంకులు కొన్నిసార్లు ప్రీ-అప్రూవ్డ్ రుణాలపై ఫీజులను రద్దు చేస్తుంటాయి.
- పర్సనల్ లోన్ : బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీతో పాటు, ప్రాససింగ్ ఫీజులు, ఇతర రుసుములు వసూలు చేస్తాయి.
అర్హతలు
- క్రెడిట్ కార్డ్ లోన్ : ఈ రుణాలు కేవలం క్రెడిట్ కార్డు ఉన్నవారికి మాత్రమే లభిస్తాయి.
- పర్సనల్ లోన్ : మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు. బ్యాంకు ఖాతాదారులు కాని వారు కూడా వ్యక్తిగత రుణం తీసుకోవడానికి వీలుంటుంది.
రుణం ఎలా అందిస్తారు?
- క్రెడిట్ కార్డ్ లోన్ : ఆమోదించిన రుణాన్ని నేరుగా మీ సేవింగ్స్ అకౌంట్లోకి లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేస్తారు.
- పర్సనల్ లోన్ : మీకు మంజూరు చేసిన రుణాన్ని నేరుగా మీ పొదుపు లేదా కరెంట్ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. లేదా నగదు, చెక్కు రూపంలో కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
రుణ ఆమోదానికి పట్టే సమయం
- క్రెడిట్ కార్డ్ లోన్ : సాధారంగా అప్లై చేసిన 24 గంటల్లోగా క్రెడిట్ కార్డు రుణం లభిస్తుంది.
- పర్సనల్ లోన్ : వ్యక్తిగత రుణాన్ని ఆమోదించేందుకు సాధారణంగా 3-5 పని దినాలు పడుతుంది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది.
గరిష్ఠ రుణం
- క్రెడిట్ కార్డ్ లోన్ : మీకున్న క్రెడిట్ కార్డు పరిమితి మేరకే ఈ లోన్ లభిస్తుంది.
- పర్సనల్ లోన్ : దరఖాస్తుదారుని ఆదాయం, క్రెడిట్ స్కోర్లను బట్టి వారికి వచ్చే గరిష్ఠ రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది.
పర్సనల్ లోన్ తిరిగి చెల్లించలేదా? డిఫాల్టర్లకు జరిగే నష్టాలివే! - What Happens To Loan Defaulters
మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! - 5 Common Credit Card Mistakes