How to Make Village Style Gongura Chutney: గోంగూరను ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు కదూ! దీన్ని విడిగానే కాదు, ఇతర కాయగూరలతో కలిపి వండినా నోరూరిపోతుంది. అంత రుచికరంగా ఉండే గోంగూరతో పక్కా పల్లెటూరి స్టైల్లో ఎప్పుడైనా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే ఓసారి ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! పైగా ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ గోంగూర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- గోంగూర - 2 కట్టలు(మీడియం సైజ్‌లో ఉన్నవి)
- పచ్చిమిర్చి - 10 నుంచి 15
- టమాటాలు - 2
- ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 3
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1(చిన్న సైజ్‌లో ఉన్నది)
తాళింపు కోసం :
- నూనె - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
- పోపు గింజలు - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఎండుమిర్చి - 4 నుంచి 6
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - పావు టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో గోంగూరను గిల్లుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే.. టమాటాలు, ఉల్లిపాయను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా.. గోంగూర పులుపుకి తగిన విధంగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని తరిగి పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌ పై.. పాన్ పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, గోంగూర వేసుకోవాలి. తర్వాత పాన్‌పై మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే.. టమాటా, పచ్చిమిర్చి, గోంగూర నూనెలో బాగా మగ్గి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఆలోపు మిక్సీ జార్లో తీసుకున్న పల్లీలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత అందులో చల్లార్చుకున్న గోంగూర మిశ్రమం, వెలుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు.. అదే మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అనంతరం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయను ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత పచ్చడికి తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. పోపు గింజలు(ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగపప్పు), కాస్త దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాళింపును దోరగా వేయించుకోవాలి.
- ఇక చివరగా అందులో ఇంగువ వేసి ఒకసారి కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఆ తాళింపులో వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత.. స్టౌ ఆఫ్ చేసుకుని పాన్‌ను దించుకుంటే చాలు. అంతే.. నోరూరించే సూపర్ టేస్టీగా ఉండే "విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి" రెడీ!
- ఈ పచ్చడిని చల్లారాక ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు నిల్వ ఉంటుంది!
ఇవీ చదవండి :
నోరూరించే స్పైసీ గోంగూర పనీర్ కర్రీ - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ వేరే లెవల్!
గోంగూర రొయ్యల కర్రీ - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్ సూపర్ హిట్!