Bengaluru Woman Murder Case Suspect : బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్యకేసులో పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు. ఆమెతో పాటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తే ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బాధితురాలు మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక నిందితుడు ముక్తి ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రధాన నిందితుడి ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఒడిశా- బంగాల్ సరిహద్దు సమీపంలో అతడి జాడ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
బాధితురాలు మహాలక్ష్మి, నిందితుడు ముక్తి ఇద్దరు ఒకే సంస్థలో ఉద్యోగం చేసేవారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌కు చెందిన అష్రఫ్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి ఉంటాడని భర్త హేమంత్ దాస్ అనుమానం వ్యక్తం చేశారు. అష్రఫ్‌తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఆ విషయంలోనే తమ మధ్య గొడవ మెుదలైందని చెప్పారు. అప్పట్నుంచే తాము కలిసి ఉండట్లేదని వెల్లడించారు.
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మహాలక్ష్మి, శ్రద్ధా వాకర్ తరహాలో దారుణ హత్యకు గురైంది. నిందితుడు, బాధితురాలని 59 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టాడు. బాధితురాలి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటం వల్ల ఇంటి యజమాని ఆమె తల్లికి సమాచారమిచ్చారు. పోలీసులుతో కలిసి ఆమె ఇంట్లో వెళ్లేసరికి బాధితురాలి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మహాలక్ష్మి చివరగా సెప్టెంబరు 1వ తేదీన ఉద్యోగానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
సెప్టెంబరు 2వ తేదీ నుంచి బాధితురాలి ఫోన్ స్విచ్చాఫ్ వస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితురాలికి విషమిచ్చి చంపారా అనే తెలుసుకునేందుకు పేగులను టాక్సికాలజీ పరీక్షకు పంపారు. ఫ్రిడ్జ్‌పైన ఉన్న వేలిముద్రలను ఫోరెన్సిక్ బృందం విశ్లేషిస్తోంది. దుండగుడు ఆమె మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఉండొచ్చని ప్రాథమికంగా భావించారు. కానీ, పోస్టుమార్టంలో 59 ముక్కలుగా నరికేసినట్లు తేలింది. ఆమె తలనే మూడు ముక్కలుగా పగలగొట్టాడని వైద్యులు గుర్తించారు.