Kangana Ranaut Apology : కేంద్రం రద్దు చేసిన 3 సాగు చట్టాలను మళ్లీ తేవాలంటూ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పష్టంచేశారు. అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలేనంటూ బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.
'గత కొద్ది రోజులుగా రైతుల అంశంపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో సాగు చట్టాలను తిరిగి తేవాలని రైతులు ప్రధాని మోదీని అభ్యర్థించాలని నేను సూచించాను. నా వ్యాఖ్యలు చాలా మందిని అసంతృప్తికి, నిరుత్సాహానికి గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తుందనే విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. వాటిని వెనక్కి తీసుకుంటున్నా' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
#WATCH | BJP MP Kangana Ranaut says, " in the last few days the media asked me some questions on farmers' law and i suggested that the farmers should request pm modi to bring back the farmers' law. many people are disappointed and disheartened by my statement. when the farmers'… pic.twitter.com/i3O5n05718
— ANI (@ANI) September 25, 2024
హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జిల్లాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా రనౌత్ సాగు చట్టాలను అమల్లోకి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. 'ఈ చట్టాలపై కొన్ని రాష్ట్రాలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలి. రైతులు ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఈ చట్టాలను మళ్లీ అమలు చేయాలి. దేశాభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే వారి శ్రేయస్సుకు ఉపయోగకరమైన ఆ చట్టాల కోసం రైతులే డిమాండ్ చేయాలి' అని అన్నారు. దీంతో కంగన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
ఇది రెండోసారి
కంగనా రనౌత్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఖండించారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంగన వివరణ ఇచ్చారు. అయితే కంగన వ్యాఖ్యలను బీజేపీ విభేదించడం ఇది రెండోసారి. గత నెలలో రైతు ఉద్యమాలతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పుడు కూడా పార్టీ ఆమెను మందలించి, భవిష్యత్‌లో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది.