Onion Price In India : దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, రేట్లను స్థిరీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బఫర్ స్టాక్స్ నుంచి రిటైల్ మార్కెట్లోకి ఉల్లిని వీలైనంత ఎక్కువగా సరఫరా చేయాలని నిర్ణయించినట్లు మంగళవారం తెలిపింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశ రాజధాని నగరం దిల్లో ఉల్లిపాయల రిటైల్ ధర కిలో రూ.67 ఉండగా, అఖిల భారత సగటు రిటైల్ ధర కిలోకు రూ.58గా ఉంది. పండుగ సీజన్ కావడం, మండీలు మూసివేసి ఉండడం వల్ల గత 2,3 రోజులుగా మార్కెట్లోకి ఉల్లి సరఫరా బాగా తగ్గింది. దీనితో డిమాండ్ పెరిగి ఉల్లి ధరలు కూడా బాగా పెరిగాయి. అందుకే సామాన్య వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ ఉల్లి ధరలను స్థిరీకరించడానికి, బఫర్ స్టాక్స్ నుంచి రిటైల్ మార్కెట్లోకి ఉల్లి నిల్వలను భారీ మొత్తంలో సరఫరా చేయనున్నట్లు పేర్కొంది.
రైలు, రోడ్డు రవాణా మార్గాల ద్వారా ఎన్సీసఎఫ్ ఈ ఉల్లి నిల్వలను దేశం నలుమూలలకు సరఫరా చేయనుంది. ఇక పంజాబ్, హరిణాయా, చండీగఢ్, హిమాచల్, జమ్మూకశ్మీర్, దిల్లీ మొదలైన ప్రాంతాల అవసరాలను తీర్చడానికి సోనిపట్‌లోని కోల్డ్ స్టోరేజ్ నుంచి ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బఫర్ స్టాక్
ఈ ఏడాది రబీ సీజన్లో ప్రభుత్వం 4.7 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించి బఫర్ స్టాక్‌గా ఉంచింది. సెప్టెంబర్ 5 నుంచి కిలో రూ.35కు చొప్పున రిటైల్ విక్రయాల కోసం పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు బఫర్‌లో ఉన్న 1.50 లక్షల టన్నుల ఉల్లిపాయనలు నాసిక్ సహా ఇతర ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా పంపించారు.
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 3.82 లక్షల హెక్టార్లలో ఉల్లి పండించారు. గతేడాదిలో సాగైన 2.85 లక్షల హెక్టార్ల కంటే ఇది 34 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
తగ్గిన టమాటా ధరలు
ప్రస్తుతం టమాటా రిటైల్ ధరలు బాగా తగ్గాయని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో వారంవారీ సగటు ధర 26 శాతం తగ్గి క్వింటాల్ ధర రూ.2,860కు చేరింది. కర్ణాటకలోని కోలార్‌లో క్వింటాల్ టమాటా రేటు రూ.2,250కు చేరింది. ఇక బంగాళాదంప అఖిల భారత సగటు రిటైల్ రేటు గత 3 నెలలుగా కిలోకు రూ.37గా ఉంది.