Intinta Chaduvula Panta App : విద్యార్థులు చదువులో నైపుణ్యం సాధించేలా రాష్ట్ర సర్కార్ కృషి చేస్తోంది. వెనకబడిన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రులకు తెలియటం లేదు. అలాంటి వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇంటింటా చదువుల పంట‘(ఐసీపీ) అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధించడంతో పాటు విద్యార్థులు ఇంటి వద్దే చదువుకునే వీలు కల్పించేలా ఈ యాప్‌ను గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తర్వాత దీని కార్యకలాపాలను క్రమక్రమంగా నిలిపివేశారు. ప్రస్తుతం తిరిగి విద్యార్థుల రిపోర్ట్‌ను అందించేలా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
తల్లిదండ్రుల సమావేశంలో..
తల్లిదండ్రుల మొబైల్లో తప్పకుండా ‘ఇంటింటా చదువుల పంట’ యాప్ ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే ఉన్నా, ఇక నుంచి ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీటింగ్‌లో(పీటీఎం) దీనిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించాలని ఇటీవల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 14న బాలల దినోత్సవం (చిల్డ్రన్స్ డే) సందర్భంగా పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో తప్పకుండా తల్లిదండ్రుల సెల్ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలి. అనంతరం ఆయా వివరాలను హెడ్ మాస్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ యాప్‌లో నమోదు చేయించాలని సూచించారు.
విధానం ఇలా..
✶ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులను తరగతుల వారీగా తల్లిదండ్రుల మొబైల్ నంబర్లను సేకరించి హెచ్‌ఎంలు వాట్సప్ గ్రూప్‌లో చేర్పిస్తారు.
✶ సోమవారం నుంచి శనివారం వరకు బోధించిన పాఠ్యాంశాలపై ప్రతి శనివారం పలు ప్రశ్నలకు సంబంధించిన లింక్ అందుబాటులోకి వస్తుంది.
✶ ప్రధానోపాధ్యాయులు లింక్‌ను వాట్సప్ గ్రూప్‌లో పంపిస్తారు. తర్వాత వచ్చే మంగళవారం వరకే ఆ లింక్ అందుబాటులో ఉండనుంది.
✶ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలతో పాటు ఈసారి ఉర్దూలో కూడా ప్రశ్నలు ఉంటాయి.
✶ ప్రతి శనివారం వారంతపు క్విజ్ సైతం నిర్వహిస్తారు.
✶ విద్యార్థులు లింక్ ఓపెన్ చేసి జిల్లా, పాఠశాల పేరు గుర్తించి ప్రవేశ బటన్ నొక్కాలి. తర్వాత పేరు, తరగతి, సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాక క్వశ్చిన్స్ కనిపిస్తాయి.
"బడి బాలల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇంటింటా చదువుల పంట యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. యాప్‌లో వచ్చే ప్రశ్నలను వారాంతపు క్విజ్‌గా స్టూడెంట్స్‌కు వివరించాలి. వారికి క్రమం తప్పకుండా లింక్ చేరేలా హెచ్‌ఎంలతో పాటు టీచర్లు చొరవ తీసుకోవాలి. ఈనెల 14వ తేదీన బాలల దినోత్సవం నాడు తప్పకుండా యాప్ ఇన్‌స్టాల్ చేయించాలి."- రాధాకిషన్, మెదక్ డీఈవో
పరీక్షలకు సన్నద్ధమవుతూ సరిగా నిద్రపోవట్లేదా?- ఐతే ఈ సమస్యలు తప్పవు!
ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ మీదే!