How To Prevent Pneumonia In Children : తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పొగమంచు తీవ్రత కూడా పెరిగింది. ఈ ఏడాది నవంబరు మాసం నుంచి చలి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. డిసెంబరు నెలలో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుందని చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చలి కారణంగా న్యుమోనియా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నేడు ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
ఈ వ్యాధి ఎలా సోకుతుంది : వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవాల వల్ల న్యుమోనియా వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటు సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి, తెల్ల రక్తకణాలను నిర్వీర్యం చేయడం వల్ల మానవ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాధి సులభంగా సోకే అవకాశముందని చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం : డబ్ల్యూహెచ్‌వో( ప్రపంచ ఆరోగ్య సంస్థ) నివేదికల ప్రకారం ఏటా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 14 లక్షల మంది చిన్నారులు న్యుమోనియా కారణంగా చనిపోతున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- చిన్న పిల్లల శరీరం వెచ్చగా ఉండటానికి స్వెట్టర్లు వేసి, చెవులకు వెచ్చదనం కోసం టోపీ పెట్టాలి. వీలైతే కాళ్లకు, చేతులకు సాక్సులు, గ్లౌవ్స్ ధరిస్తే బాగుంటుంది.
- పాలు తాగే నెలల వయసున్న శిశువులు ఉంటే కన్నతల్లి పొత్తిళ్లలో పడుకోబెడితే కాస్త బిడ్డకు కాస్త వెచ్చతనం లభిస్తుంది.
- ఉదయం నీరెండలో కొద్ది సేపు ఉంచితే ప్రయోజనం
- ఉదయపు ప్రయాణాలు చేయొద్దు
- అవసరమైన టీకాలు ఇప్పించాలి.
- వైద్యులను సంప్రదించాలి
"శీతాకాలంలో చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చలి కారణంగా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. . ఏ మాత్రం వారు అస్వస్థతకు గురైనా సమీపంలోని ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించాలి" -అడ్డి హేమలత, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు, రిమ్స్
శ్వాస సంబంధ సమస్యలు, జలుబు, జ్వరం కారణంగా ప్రతి రోజూ సుమారుగా 20 మంది చిన్నారులు రిమ్స్‌లో చేరుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ వార్డులో 70 బెడ్స్ ఉండగా జ్వరం, దగ్గు, జలుబుతో చేరిన వారే ఎక్కువగా ఉన్నారని వైద్యులు వివరించారు.
ఎందుకంటే : ఆదిలాబాద్ రిమ్స్‌లోనే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో నెలలో దాదాపు 600 మంది చేరుతున్నారు. ఈ లెక్కన ఇతర ప్రైవేటు హాస్పిటల్స్, పీహెచ్‌సీల్లో చేరే వారి సంఖ్య లెక్కేసుకుంటే వేలల్లోనే ఉంటుంది. చలి తీవ్రత కారణంగా జ్వరం, ఒంటికి దద్దుర్లు కూడా రావచ్చు. దగ్గు, ముక్కు కారటం, శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడటం, గొంతు నొప్పిగా ఉంటుంది. తుమ్ములు వచ్చే అవకాశాలు, పిల్లి కూతలు ప్రారంభం కావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా శ్వాస సంబంధ బాధితులు వివరాలు ఇలా
- ఆదిలాబాద్: 4,403
- కుమురంభీం: 3,967
- నిర్మల్: 4,035
- మంచిర్యాల: 4,985
చలికాలంలో పిల్లలకు న్యూమోనియా ప్రమాదం - ఇలా చేయండి - లేకపోతే ఇబ్బందే!
చలి పులి పంజా విసురుతోంది - తాతా బామ్మా కాస్త జాగ్రత్తగా ఉండండి