తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.12కోట్లు లూటీ- ఆధార్​ స్కామ్​ అంటూ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​కు ట్రాప్ - BENGALURU LOSES RS 12 CRORE

బెంగళూరు టెకీ డిజిటల్ అరెస్ట్​ - రూ.11.8కోట్లు వారి అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్ చేయించుకున్న సైబర్ కేటుగాళ్లు

Bengaluru loses Rs 12 Crore In Digital Arrest
Bengaluru loses Rs 12 Crore In Digital Arrest (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Bengaluru loses Rs 12 Crore In Digital Arrest :కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ టెకీ డిజిటల్ అరెస్ట్​ అయ్యి రూ.11.8 కోట్లు పోగోట్టుకున్నాడు. పోలీసు అధికారులమని నమ్మించిన మోసగాళ్లు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​కు భారీ మొత్తంలో టోకరా వేశారు. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న 39 ఏళ్ల బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం- నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 మధ్య ఈ మోసం జరిగింది. నవంబర్ 11న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) అధికారినంటూ ఓ వ్యక్తి బాధితుడికి కాల్ చేశాడు. తన ఆధార్ ​కార్డుతో అనుసంధామైన సిమ్​ను చట్టవ్యతిరేక వాణిజ్య ప్రకటనలకు, వేధింపులకు గురిచేయడానికి ఉపయోగించారని బాధితుడికి మోసగాడు చెప్పాడు. ఇదే విషయంపై ముంబయిలోని కొలాబ సైబర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని బెదిరించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి బాధితుడికి కాల్​ చేసి స్కైప్ యాప్​ డౌన్​లోడ్ చేసుకోమన్నాడు.

అనంతరం ముంబయి పోలీసుల లాగా డ్రెస్ వేసుకున్న మరో వ్యక్తి వీడియో కాల్ చేశాడు. 'మీ ఆధార్​ కార్డు ఉపయోగించి ఓ వ్యాపారి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశాడు. దాని ద్వారా రూ.6కోట్ల లావాదేవీలు జరిపాడు. మనీ లాండరింగ్​కు ఆ బ్యాంకు అకౌంట్​ను ఉపయోగించారు' అని వీడియో కాల్​లో బాధితుడిని భయపెట్టాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచకపోతే, దర్యాప్తునకు సహకరించకపోతే అరెస్ట్​ చేస్తామని బెదిరించాడు.

నవంబర్ 25న పోలీసు డ్రెస్ వేసుకున్న మరో వ్యక్తి బాధితుడికి స్కైప్​లో కాల్​ చేశాడు. 'కేసు పెద్ద కోర్టులో ఉంది, మేము చెప్పిన విధంగా నడుచుకోకపోతే నీ కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేస్తాం' అని బెదిరించాడు. అలా ఒకరి తర్వాత ఒకరు ఫోన్​ చేసుకుంటూ బాధితుడిని భయాందోళనలకు గురి చేశారు.

ఆర్​బీఐ మార్గదర్శకాలను వల్లెవేస్తూ బాధితుడిని భయపెట్టారు. అకౌంట్ వెరిఫికేషన్ అని నమ్మించి ఓ బ్యాంక్ అకౌంట్​కు డబ్బులు పంపించమన్నారు. అలా చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో భయపడిపోయిన బాధితుడు క్రమంగా సైబర్ మోసగాళ్లకు మొత్తం రూ.11.8 కోట్లు పంపించాడు. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బులు డిమాండ్​ చేస్తుండటం వల్ల తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టం, బీఎన్​ఎస్​లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details