తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నెలసరి రోజుల్లో మహిళలకు పెయిడ్ లీవ్ ఇవ్వాలి' - ఐరాసలో గళం విప్పిన రంజితా ప్రియదర్శిని - Paid Menstrual Leaves For Women - PAID MENSTRUAL LEAVES FOR WOMEN

Paid Menstrual Leaves For Women : నెలసరి సమయంలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని భారత్‌కు చెందిన ఉద్యమకారిణి ఐక్యరాజ్యసమితి వేదికగా గళం విప్పారు.

Social activist Ranjeeta Priyadarshini
Social activist Ranjeeta Priyadarshini (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 10:59 AM IST

Paid Menstrual Leaves For Women :నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్​) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు. అప్పుడే మహిళలు జీతంలో కోత పడుతుందనే ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాలో న్యూయార్క్‌ నగరంలో 79వ సర్వసభ్య ప్రతినిధి సభలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' కార్యక్రమంలో రంజితా ప్రియదర్శిని మాట్లాడారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె చాలా కృషి చేస్తున్నారు.

నా లక్ష్యం అదే!
'రెండోసారి ఐరాస సదస్సుకు హాజరైనందుకు గర్వంగా ఉంది. నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నదే నా ప్రధాన లక్ష్యం. ఆ రోజుల్లో ఒకటి నుంచి రెండు రోజులు సెలవులు ఇవ్వాలి. జీతం ఇవ్వకపోతే ఏ మహిళ కూడా ఆ సెలవు తీసుకోదు. కెన్యాలో జరిగిన ఐరాస సదస్సులో తొలిసారి ఈ విషయం గురించి ప్రస్తావించాను' అని ప్రియదర్శిని తెలిపారు. కెన్యా సదస్సు అనంతరం ఒడిశా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుందని కూడా ఆమె తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి పెయిడ్‌ పీరియడ్ లీవ్‌ ఇనీషియేటివ్‌ను ఒడిశా అమలుచేసింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఏడాదికి ఆ తరహాలో ఆరు సెలవులు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం చర్యను అభినందించిన ఆమె, ఆ సెలవుల సంఖ్యను 12కు పెంచాలని కోరారు.

తన పోరాటం వెనక వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలు కారణమని రంజితా ప్రియదర్శిని తెలిపారు. ఆ సమయంలో తాను సెలవు కోరినందుకు, తన మేనేజర్ నుంచి అవమానం ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని వెల్లడించారు. ఆమె ప్రయత్నాలు నెలసరి ఆరోగ్యం గురించి చర్చించేలా, ఆ దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తున్నాయి.

ఒక రోజు సెలవు
ఇదిలా ఉంటే, స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళలకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవు ను తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details