తెలంగాణ

telangana

అనాథ శవాలనూ వదలని ఆర్​జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌ - సిట్ విచారణలో సంచలన విషయాలు! - kolkata doctor case

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 1:16 PM IST

Updated : Aug 21, 2024, 1:23 PM IST

Kolkata Doctor Case : బంగాల్ వైద్యురాలు హత్యాచారం ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆర్​జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్ అనాథ శవాలు, వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్‌ బాటిల్స్‌, రబ్బర్‌ గ్లౌజులు అక్రమంగా అమ్ముకుని కోట్లు సంపాదిస్తుంటాడని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంకా అతను ఎలాంటి ఘోరాలు చేశాడంటే?

Kolkata Doctor Case
Kolkata Doctor Case (IANS Photo)

Kolkata Doctor Case : కోల్‌కతా ఆర్​జీ కర్‌ మెడికల్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్​పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఘోష్​ చివరికి అనాథ శవాలను అమ్మేశాడని; వాడేసిన సిరంజులను, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్‌ చేసి సొమ్ము చేసుకొనేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి, ప్రస్తుతం ముర్షిదాబాద్‌ డిప్యూటీ మెడికల్‌ కాలేజీ సుపరింటెండెంట్‌గా ఉన్న అక్తర్‌ అలీ సిట్ విచారణలో ఈ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

సందీప్‌ ఘోష్​పై తీవ్రమైన అరోపణలు
వైద్యురాలి హత్యాచారంపై ఏర్పాటైన సిట్‌ ఇటీవల అక్తర్‌ అలీని విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 2023 జులై 14న అలీ రాసిన లేఖ ప్రకారం, ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్‌ లేదా స్వాస్త్‌ భవన్‌ అనుమతులు లేకుండానే ఘోష్‌ లీజుకు ఇచ్చేవాడు. ఇక వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడు. ఇక సరఫరాదారుల నుంచి 20 శాతం కమిషన్‌ పుచ్చుకొనేవాడని ఘోష్‌పై అలీ ఆరోపించాడు. దీంతోపాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకొనేవాడని ఆరోపణలున్నాయి.

అనాథ శవాలు, వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్‌ బాటిల్స్‌, రబ్బర్‌ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతీ రెండు రోజులకు 500-600 కిలోలు వరకు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీవాసుల సాయంతో ఘోష్‌ రీసైక్లింగ్‌ చేయించేవాడని, ఇదే అంశంపై అలీ అప్పట్లోనే విజిలెన్స్‌ కమిషన్‌, ఏసీబీ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లకు ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది.

భార్యపై దాడి
సందీప్‌ ఘోష్‌ గురించి మరిన్ని ఘోరమైన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అతను చాలాసార్లు తన భార్యపై అమానవీయంగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆమె సిజేరియన్‌ చేయించుకొని బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల తర్వాత ఘోష్‌ తీవ్రంగా ఆమెపై దాడి చేసినట్లు ఇరుగు పొరుగువారు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైనట్లు పేర్కొన్నారు. తొలుత అది వారి కుటుంబ విషయమని పట్టించుకోని స్థానికులు, చివరకు ఆమె పరిస్థితి చూసి జోక్యం చేసుకొన్నారు. వీధి మొత్తం ఏకమై ఆందోళనకు దిగినట్లు స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల వారితో కూడా అతడు సక్రమంగా ప్రవర్తించేవాడు కాదని పేరుంది.

రాయ్‌కి లై డిటెక్టర్‌ పరీక్ష
మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌కి లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. మంగళవారమే అతడికి ఈ టెస్టు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, న్యాయవాది లేకపోవడంతో ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది.

'వైద్యురాలి హత్యాచారంపై FIR నమోదుకు ఎందుకంత ఆలస్యం?'- బంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్ - Supreme Court on Doctor Murder Case

మెడికో మర్డర్​పై బంగాల్​ దిద్దుబాటు​ చర్యలు! మహిళల సేఫ్టీకి స్పెషల్ యాప్- దేశవ్యాప్త నిరసనలపై కేంద్రం నజర్ - Kolkata Murder Incident

Last Updated : Aug 21, 2024, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details