తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజీనామా చేసేంత తప్పేం చేయలేదు'- ముడా స్కామ్​లో గవర్నర్ నిర్ణయంపై సిద్ధ ఫైర్! - Siddaramaiah MUDA Scam Case - SIDDARAMAIAH MUDA SCAM CASE

Siddaramaiah MUDA Scam Case : కన్నడ రాజకీయాలను ముడా స్కామ్ కేసు కుదిపేస్తోంది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం వల్ల రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాను రాజీనామా చేసేంత తప్పేమి చేయలేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మరోవైపు, సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

SIDDARAMAIAH
SIDDARAMAIAH (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 6:08 PM IST

Siddaramaiah MUDA Scam Case : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయాన్ని సిద్ధరామయ్య తప్పుపట్టారు. అది రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. తాను రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదని వివరించారు.

"కర్ణాటకలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయి. దిల్లీ, ఝార్ఖండ్​తో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలకు పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నాకు మద్దతుగా ఉన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. రాజ్‌ భవన్​ను రాజకీయ పావుగా వాడుకుంటున్నాయి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందనే ముందే ఊహించాను" అని సిద్ధరామయ్య మీడియాతో వ్యాఖ్యానించారు.

'పార్టీ మొత్తం సిద్ధరామయ్యకు అండగా ఉంది'
ఇదే విషయంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. పార్టీ , ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అండగా ఉందని తెలిపారు. సిద్ధరామయ్య ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. అసలు కేసే లేని చోట వివాదం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతారని పేర్కొన్నారు.

'ఇది రాజకీయ ప్రతీకార చర్య'
ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్​కు గవర్నర్ అనుమతివ్వడంపై కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సూర్జేవారా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దీన్ని ప్రధాని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. మరోవైపు, ఇది అత్యంత దురదృష్టకరమైన చర్య అని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు. అలాగే గవర్నర్ తీరును ఆయన తప్పుపట్టారు.

'సిద్ధరామయ్య రాజీనామా చేయాలి'
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గవర్నర్ ప్రాసిక్యూషన్​కు అనుమతించడంపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. అంతా చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది. ముడా కుంభకోణం కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య డిమాండ్ చేశారు. మరోవైపు, గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఎక్స్ వేదికగా తెలిపారు.

కాంగ్రెస్ నిరసనలు
సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగళూరు, మైసూరు, మాండ్యతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు శనివారం నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో గవర్నర్​ను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే గవర్నర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైకోర్టులో కేవియట్
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌ చంద్ గహ్లాత్ అనుమతి ఇవ్వడం వల్ల ముడా కుంభకోణం కేసులో ఫిర్యాదుదారుల్లో ఒకరు శనివారం కర్ణాటక హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో మరో పిటిషనర్ టీజే అబ్రహం సోమవారం కేవియట్ దాఖలు చేస్తానని తెలిపారు.

ఇదీ కేసు
ఇదిలా ఉంటే ఏడు రోజుల్లోగా ముడా స్కామ్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశిస్తూ గత నెల సీఎంకు గవర్నర్‌ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాంతో విచారణకు అనుమతించవద్దని ఆదేశిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయంపై కర్ణాటక సర్కార్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక సీఎంకు షాక్- ముడా స్కామ్​లో సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ పర్మిషన్

'ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్' - కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details