Siddique Murder Case Shooter Arrest :మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిఖీపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షూటర్ శివకుమార్‌తోపాటు మరో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు నేపాల్‌కు పారిపోయేందుకు యత్నించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు షూటర్లలో శివ ఒకడు. ఘటనానంతరం పరారయ్యాడు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ ఎస్టీఎఫ్తో కలిసి ముంబయి పోలీసులు ఆదివారం శివకుమార్‌తోపాటు అతడికి ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుడికి ఆశ్రయంతో పాటు నేపాల్ పారిపోయేందుకు సహకరించినందుకు కశ్యప్, జ్ఞాన్ ప్రకాశ్ త్రిపాఠి, ఆకాశ్ శ్రీవాస్తవ, అఖిలేంద్ర ప్రతాప్ సింగ్ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో తనకు సంబంధం ఉందని విచారణలో అతడు అంగీకరించాడని, అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకే ఈ హత్య చేసినట్లు చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.