Shivraj Singh Chouhan ETV Bharat Interview : త్వరలో జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి దక్షిణ భారతమే అతిపెద్ద సవాల్. అందుకే నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కు దక్షిణాది బాధ్యతలను బీజేపీ అప్పగించింది. అందులో భాగంగా సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో విజయావకాశాలు, రైతుల ఉద్యమం, ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
'దక్షిణాదిలో ఊహించని ఫలితాలు వస్తాయి'
దక్షిణ భారతంలో బీజేపీ బలహీనంగా ఉందని అనుకుంటున్నారని, కానీ ఈసారి ఊహించని ఫలితాలు వస్తాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్టాటకలో మొత్తం 28 సీట్లలో తమ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలను వివరించారు.
'మోదీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి దారిద్ర్య రేఖ ఎగువకు వచ్చారు. పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించాం. 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము. 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాము. 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. వీధి వ్యాపారుల పథకం వల్ల చిన్న దుకాణదారులు లబ్ధి పొందారు.' అని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు.
'ప్రజలు మోదీతోనే ఉన్నారు'
దక్షిణ భారత ప్రజల హృదయాల్లో కూడా మోదీ ఉన్నారని చౌహాన్ అన్నారు. 'నేను కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో పర్యటించాను. కర్ణాటకలోని గ్రామాలను సందర్శించి, క్రైస్తవులు, ముస్లింలతో సహా అందరు లబ్ధిదారులతో మాట్లాడాను. వారు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి ప్రజలు ఆయనతో (ప్రధాని మోదీ) ఉన్నారని నేను భావిస్తున్నాను. అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, CAA అమలు, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, దేవాలయాల పునరుద్ధరణ వంటి చారిత్రక నిర్ణయాల వల్ల మూడో పర్యాయంలోనూ మోదీ భారత్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తారని భారతీయులు ఆశిస్తున్నారు. అభివృద్ధి చెందిన భారత్ మోదీ లక్ష్యం, గ్యారంటీ. అందుకోసం ఇప్పటికే పునాది వేశారు.' అని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
'అభివృద్ధి కోసం దేవుడు పంపిన వ్యక్తి మోదీ'
భారతదేశ అభివృద్ధి కోసం దేవుడు పంపిన అత్యున్నత వ్యక్తి మోదీ అని శివరాజ్ కొనియాడారు. అత్యంత ముఖ్యమైన పనుల కోసమే దేవుడు ఇలాంటి వ్యక్తులను పంపుతాడని ప్రశంసించారు. 'భారత్ అభివృద్ధి ప్రస్థానంలో మోదీ చరిత్ర సృష్టించారు. ఇది అరుదైన, ఊహకు అందనిది. ఆయన అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాశాన్ని గెలుచుకున్నారు. విపక్ష పార్టీలు కులగణన గురించి మాట్లాడాయి. కానీ మోదీ దృష్టిలో పేదలు, రైతులు, యువత, మహిళలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయి. ఈ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆయన శ్రమించారు' అని ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.