Maharashtra Next CM : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్నప్పటికీ, సీఎం అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. నాలుగు రోజులుగా ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడణవీస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సీఎం పదవి దక్కని పక్షంలో తన ప్లాన్-బీని కూటమి నేతల వద్ద ఏక్‌నాథ్ శిందే ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిందే శిబిరం నేతల మధ్య మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. తనను ముఖ్యమంత్రిని చేయకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబట్టినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
కౌన్ బనేగా 'మహా' సీఎం? ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే శిందే ప్లాన్ అదేనా? - MAHARASHTRA CM
మహా సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
Published : Nov 27, 2024, 12:27 PM IST
అదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతోంది. భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్ఠానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతోపాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోందని వెల్లడించారు.
అప్పటి వరకు ఆయనే సీఎం
మరోవైపు మహారాష్ట్ర 14వ శాసనసభ గడువు మంగళవారంతో ముగియనుండటం వల్ల ఏక్‌నాథ్ శిందే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను 234 స్థానాలతో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది. అందులో బీజేపీ 132స్థానాలు గెలుపొందగా, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లల్లో విజయం సాధించాయి. కొత్తప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కవచ్చు. అయితే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం అంటుండగా, ఏక్‌నాథ్ శిందేనే కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది.