Shashi Tharoor on PA Arrest : బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మాజీ పీఏ శివకుమార్ ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. మే 29న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో శివ కుమార్ ఒకరని కస్టమ్స్ అధికారిక వర్గాలు తెలిపాయి. నిందితుల వద్ద నుంచి 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై శశిథరూర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
'దర్యాప్తులో అధికారులకు సహకరిస్తా'
'ఈ విషయం విని నేను షాక్‌కు గురయ్యా. ఆ వ్యక్తి నా మాజీ సిబ్బందిలో ఒకరు. ఎయిర్‌పోర్టుకు సంబంధించిన కార్యకలాపాల్లో నాకు పార్ట్‌టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. రిటైర్ అయిన ఆ 72ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తా' అని శశి థరూర్ స్పష్టత ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
బ్యాంకాక్ నుంచి దిల్లీకి బుధవారం వచ్చిన ఓ భారతీయుడిపై అనుమానం వచ్చి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 'అతడిని తనిఖీ చేశాం. దర్యాప్తులో ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఓ ప్రయాణికుడు గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు సాయం చేయడానికి శివ కుమార్ విమానాశ్రయానికి వచ్చాడు. దీంతో అతడిని అడ్డగించి రూ.35.22 లక్షల విలువైన 500 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నాం. బంగారాన్ని ప్రయాణికుడు అరైవల్ హాల్ లోపల శివ కుమార్‌కు అప్పగించాడు. శివ కుమార్‌కు ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ ఉంది. పార్లమెంటు సభ్యుని ప్రోటోకాల్ బృందంలో భాగంగా శివ కుమార్ ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ ను పొందే అవకాశం గురించి పరిశీలిస్తున్నాం. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది' అని కస్టమ్స్ వర్గాలు తెలిపాయి.