West Bengal Train Accident :బంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్‌పాయ్‌గుడి సమీపంలో కాంచన్‌జంఘూ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మంది మరణించినట్లు, మరో 60మందికి గాయాలైనట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందారని, మరో 41మందికి గాయాలైనట్లు తాజాగా రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది.
అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా, ఎక్స్‌ప్రైస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచింది. ఈ ఘటనలో 9మంది మరణించారని, 41మంది గాయపడ్డారని రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని డార్జిలింగ్ ఎస్పీ చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దిల్లీలోని రైల్వే అధికారులు ఈ ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.