SC On Citizenship Act : పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6ఎ రాజ్యంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. సెక్షన్ 6A రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఈమేరకు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం సెక్షన్ 6A చెల్లుబాటు అవుతుందని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీ తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల్లో జస్టిస్ పార్థీవాలా మాత్రమే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
విచారణ సందర్భంగా మెజారిటీ తీర్పును సీజేఐ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు. "అక్రమ వలసలకు అసోం అకార్డ్ ఓ రాజకీయ పరిష్కారం. అదే సమయంలో సెక్షన్-6ఎ అనేది చట్టబద్ధమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజార్టీతో కూడిన పార్లమెంటుకు శక్తి ఉంది. మానవీయ ఆందోళనలను పరిష్కరించి, స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్‌కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదే. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్ తీసుకొచ్చిన విషయాన్ని ఇది చెబుతోంది. ఈ సెక్షన్ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదు" అని పేర్కొన్నారు.