తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రెడిట్ కార్డ్ హోల్డర్స్​కు షాక్- బకాయిలపై 30శాతానికి పైగా వడ్డీ- సుప్రీంకోర్టు కీలక తీర్పు - SC ON CREDIT CARD INTEREST RATES

క్రెడిట్ కార్డు బకాయిల వడ్డీ రేట్లపై సుప్రీం కీలక తీర్పు - బ్యాంకులు 30శాతానికి మించి వడ్డీ వసూలు చేసుకోవచ్చన్న సుప్రీం- NCDRC తీర్పును పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం

SC Verdict On Credit Card Due Interest Rates
SC Verdict On Credit Card Due Interest Rates (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2024, 5:37 PM IST

SC Verdict On Credit Card Due Interest Rates :క్రెడిట్ కార్డు బకాయిలపై బ్యాంకులు 30శాతానికి పైగా వడ్డీ వసూలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 16ఏళ్ల నాటి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్- NCDRC తీర్పును పక్కన పెట్టింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ ధర్మాసనం - NCDRC ఇచ్చిన తీర్పు చట్టువిరుద్ధం అని గురువారం తేల్చిచెప్పింది. అది రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్​బీఐ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అని పేర్కొంది. అంతేకాకుండా ఆ తీర్పు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949 ఉద్దేశానికి విరుద్ధం అని చెప్పింది.

'NCDRCకి ఆ అధికారం లేదు'
క్రెడిట్​ కార్డు హోల్డర్లను మోసం చేయడానికి బ్యాంకులు ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా బ్యాంకులు, క్రెడిట్ కార్డు హోల్డర్ల మధ్య కుదిరిన ఒప్పందం నిబంధనలను తిరిగి రాయడానికి NCDRCకి ఎలాంటి అధికార పరిధి లేదని స్పష్టం చేసింది. ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయించే లేదా అన్యాయమైన నిబంధనలు ఉన్న ఒప్పందాలను పక్కన పెట్టే, వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రమే NCDRCకి ఉందని తెలిపింది. అయితే విధించే వడ్డీ రేటు, ఆర్​బీఐ ఆదేశాల గురించి ఎప్పటికప్పుడు బ్యాంకులు క్రెడిట్ కార్డు హోల్డర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. వడ్డీ విధింపు అన్యాయంగా, ఏకపక్షంగా ఉండకూడదని స్పష్టం చేసింది.

'బ్యాంకులు అలా చేయాలి'
సరైన సమయంలో పేమెంట్లు పూర్తి చేయడం, ఆలస్య రుసుం వంటి బాధ్యతలు, హక్కుల గురించి క్రెడిట్ కార్డు హోల్డర్లకు బ్యాంకులు అవగాహన కలిగించాలని ధర్మాసనం సూచించింది. క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని పొందే సమయంలో, వడ్డీ రేటుతో సహా అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతుల గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా బ్యాంకులు చూడాలని తెలిపింది. సంబంధిత బ్యాంకులు జారీ చేసిన నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండటానికి కస్టమర్లు అంగీకరించాలని సూచించింది. క్రెడిట్ కార్డు నిబంధనలు ఫిర్యాదుదారులకు తెలిసిన తర్వాత లేదా క్రెడిట్ కార్డు జారీకి ముందు బ్యాంకులు ఆ వివరాలను వెల్లడించిన తర్వాత- వడ్డీ రేటు సహా ఆ నిబంధనలను NCDRC పునఃపరిశీలించలేదని స్పష్టం చేసింది.

అయితే, ఈ కేసులో ఆర్​బీఐ జారీ చేసిన పాలసీ ఆదేశాలకు విరుద్ధంగా ఏ బ్యాంకు కూడా ప్రవర్తించిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అంతేకాకుండా బ్యాంకులు విధించిన అధిక వడ్డీ రేటుపై అభ్యంతరాల గురించి బాధిత వర్గం ఆర్​బీఐని సంప్రదించలేదని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.

ఏమిటీ కేసు?
క్రెడిట్‌ కార్డు బిల్స్‌ ఆలస్య చెల్లింపులపై వార్షికంగా 30 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని ఎన్‌సీఈడీఆర్‌సీ 2008లో తీర్పు వెలువరించింది. ఆలస్య చెల్లింపులపై బ్యాంకులు 36 నుంచి 49 శాతం మేర వడ్డీ వసూలు చేస్తుండడంపై ఆవాజ్‌ ఫౌండేషన్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడం వల్ల ఈ తీర్పు వెలువడింది. దీనిపై సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్​ప్రెస్, హెచ్​ఎస్​బీసీ, స్టాండర్డ్​ చార్టర్డ్​ వంటి కొన్ని బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తొలుత స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు 2009లో ఎన్​సీఈడీఆర్​సీ తీర్పును నిలిపివేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ కమిషన్‌ ఆదేశాలను పక్కన పెట్టింది. క్రెడిట్ కార్డు బకాయిలపై బ్యాంకులు 30శాతానికి పైగా వడ్డీ విధించవచ్చని తీర్పునిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details