తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నీట్‌ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు'- సుప్రీంకోర్టు తీర్పు - SC on NEET UG Paper Leak - SC ON NEET UG PAPER LEAK

SC on NEET UG Paper Leak : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌-యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పేపర్​ లీక్​కు సంబంధించిన పిటిషన్లపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.

SC on NEET UG Paper Leak
SC on NEET UG Paper Leak (ETV Bharat, ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 5:22 PM IST

Updated : Jul 23, 2024, 8:44 PM IST

SC on NEET UG Paper Leak :వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షను మళ్లీ జరపాలన్న డిమాండ్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థాగతమైన లీకేజీ, ఇతర అక్రమాలకు సంబంధించి అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నీట్‌ పేపర్‌ లీక్‌ అయిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్‌, జస్టిస్‌ Jbపర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు, వ్యవస్థాగతమైన ఉల్లంఘన జరిగిందని చెప్పటానికి ఆధారాలు లేవని పేర్కొంది.

"ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధరణకు రావడం ప్రస్తుత దశలో కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు. వారిలో అనేకమంది వందల కి.మీల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు" అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడం వల్ల అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 'ఫిజిక్స్‌ వాలా' విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండేతో పాటు మరి కొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

సత్యమేవ జయతే : కేంద్ర మంత్రి
నీట్​ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ హర్షం వ్యక్తం చేశారు. 'సత్యమేవ జయతే' అని చెప్పిన మంత్రి, సుప్రీం తీర్పును స్వాగతించారు. రెండు రోజుల్లో ఫైనల్​ ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమని చెప్పారు. భారీ స్థాయిలో పేపర్​ లీక్​ జరగలేదంటూ గత 2నెలలుగా తాము చెబుతున్నామని, సుప్రీం సైతం అదే భావించిందని తెలిపారు.

సీజేఐతో న్యాయవాది ఫైట్​!
మరోవైపు నీట్​ పేపర్​ లీక్​పై విచారణ జరుగుతున్న సమయంలో సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​, న్యాయవాది నెడుంపర మధ్య వాడీవేడీ చర్చ నెలకొంది. సీనియర్​ న్యాయవాది నరేందర్​ హూడా వాదిస్తున్న సమయంలో నెడుంపర తరుచుగా మధ్యలో వాదిస్తూ అడుపడ్డారు. హుడా తర్వాత సమయం ఇస్తామని చెప్పినా, వినకుండా మధ్యలో ఆటంకం కల్పించారు. ఈ క్రమంలోనే అగ్రహించిన సీజేఐ, సెక్యూరిటీని పిలిచి బయటకు పంపాలంటూ ఆదేశించారు. దీంతో స్పందించిన న్యాయవాది నెడుంపర, తానే బయటకు వెళ్లిపోతానంటూ సీజేఐకి తెలిపారు.

Last Updated : Jul 23, 2024, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details