SC On NEET UG 2024 :నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతున్న భారత సర్వోన్నత న్యాయస్థానం పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను గురువారం ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. నీట్- యూజీ సంబంధిత పిటిషన్‌లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలు కనిపించకుండా చూడాలని సూచించింది.
అంతకుముందు విస్తృత స్థాయిలో అక్రమాలు జరిగాయని(లీక్ అయ్యిందని) గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొలిసిటర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారు.
తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు!
సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాముఖ్యం ఇస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని సీజేఐ అన్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. 'మొత్తంగా మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు నీట్ పరీక్షలో పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?' అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు.