SC On Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ వైద్యురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి వెంటనే తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారని మరోసారి ప్రశ్నించింది. హత్యాచార ఘటనపై సోమవారం మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అలాగే నిరసన చేపడుతోన్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. మరోవైపు కేసు దర్యాప్తుపై కొత్త నివేదికను సమర్పించాలని సీబీఐని నిర్దేశించిది.
ఫొరెన్సిక్ నివేదిక కోసం మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్‌ను దిల్లీ ఎయిమ్స్‌కు పంపాలనుకుంటున్నట్లు సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. 'ముందుగా పోలీసులు సేకరించిన శాంపిల్స్‌ను బంగాల్లోని సీఎఫ్ఎస్ఎల్కు తరలించి పరీక్షలు చేశారు. ఈ నివేదిక మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ నమునాలను సీబీఐ ఎయిమ్స్ పంపాలనుకుంటుంది.' అని సుప్రీం కోర్టుకు తెలిపారు. కొత్త నివేదికను సెప్టెంబర్ 17న సమర్పించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.