Delhi Excise Policy Kejriwal Case :దిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో పాటు ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విసృత ధర్మాసనానికి బదిలీ చేసింది. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలేవరకు మధ్యంతర బెయిల్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ కేసులోనే సీబీఐ అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ లభించినా కూడా కేజ్రీవాల్ తిహాడ్ జైల్లోనే ఉండనున్నారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 9న దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈడీ, సీఎం తరఫు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. ఈసందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలివ్వట్లేదని తెలిపింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న నాయకుడని, ఇప్పటికే 90 రోజుల జైలు శిక్ష అనుభవించారని పేర్కొంది.
'ఇదొక పెద్ద విజయం'
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడాన్ని పెద్ద విజయంగా అభివర్ణించారు ఆయన తరఫు న్యాయవాది రిషికేశ్ కుమార్. 'సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ 19, ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీబీఐ కేసులో బెయిల్ పెండింగ్‌లో ఉన్నందు వల్ల కేజ్రీవాల్ జైల్లోనే ఉంటారు.' అని రిషికేశ్ కుమార్ తెలిపారు. మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే చాలా రోజులు జైలు శిక్ష అనుభవించారని, అందుకే ఈడీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది షాదన్ ఫరస్త్ తెలిపారు.
'బీజేపీ కుట్రను న్యాయస్థానం బహిర్గతం చేసింది'
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. 'సత్యమేవ జయతే' అని, కేజ్రీవాల్ జాతీయ జెండాను పట్టుకున్న చిత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు, ప్రతీ న్యాయస్థానం కేజ్రీవాల్‌పై బీజేపీ కుట్రను బహిర్గతం చేసిందని ఆప్ నాయకురాలు అతిషి ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో దిల్లీ సీఎంకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం వల్ల బీజేపీ కుట్ర పన్నిందని మరోసారి రుజువైందని విమర్శించారు. ఈ రోజు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును ఇచ్చిందని మరో ఆప్ సీనియర్ నేత సందీప్ పాఠక్ తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ సృష్టించిందని ఆరోపించారు.
'కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు'
సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు అనేది ఈడీ, న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్ణయమని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తే నిర్దోషిగా ప్రకటించినట్లు కాదని విమర్శించారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.