Saif Ali Khan Attack Case :బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ వీడియోలో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని ఈ సాంకేతికత ద్వారా నిర్ధరించినట్లు పోలీసులు ప్రకటించారు. ఇంతకుముందు దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
19 ఫింగర్ ప్రింట్స్ సేకరణ
ఇదిలా ఉండగా, జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన విచారణ అధికారుల బృందం అక్కడ ఉన్న దాదాపు 19 ఫింగర్ ప్రింట్స్ ను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి.
ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడం వల్ల అవి సైఫ్ అలీఖాన్‌వేనా, కాదా? అని నిర్ధరించేందుకు నమూనాలను సేకరించారు.