Sabarimala Temple Collection : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్‌లో రూ. 357.47 కోట్లుగా నమోదైనట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) తెలిపింది. గత సీజన్‌లో రూ.347.12 కోట్లు వచ్చాయని, ఈ ఏడాది రూ.10.35 కోట్ల మేర పెరిగాయి టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. అలానే ఈ సీజన్‌లో భక్తుల సంఖ్య కూడా పెరిగినట్లు తెలిపారు.
శబరిమలకు 50 లక్షల మంది భక్తులు
మొత్తం ఆదాయంలో అరవణ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 146 కోట్లు వచ్చాయి. అలానే రూ. 17 కోట్లు శబరిమల యాత్రకు వచ్చిన భక్తులు సమర్పించారు. అయితే భక్తులు సమర్పించిన నగదును లెక్కించడం ఇంకా పూర్తి కాలేదు. అవి కూడా లెక్కిస్తే దాదాపుగా రూ.10 కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చని టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రకటించారు. అలానే ఈ సీజన్‌లో శబరిమలకు 50 లక్షల (50,06,412) మంది భక్తులు వచ్చారని, గత సీజన్ కంటె ఐదు లక్షల మంది అదనంగా వచ్చారని ప్రశాంత్ పేర్కొన్నారు.
"మండలకాల పాదయాత్రకు ఏడు నెలల ముందే సన్నాహాలు ప్రారంభించాం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాం. అయితే ఈ ఏడాదిలో పారిశుద్ధ్య సంబంధించిన పనులు ఎక్కువగా జరిగాయి. నిలైక్కల్లో 1100, పంబలో 500 కంటైనర్ టాయిలెట్లను ఏర్పాటు చేశాం. పంబ- శబరిమల రోడ్డు మార్గంలో 1200 మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. వచ్చే సీజన్‌లో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం" ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వివరించారు.
దర్శనం చేసుకోకుండానే వెనక్కి
మండల పూజల సందర్భంగా గత డిసెంబర్లో శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో రద్దీని అరికట్టడంలో భద్రతా దళాలు విఫలమయ్యాయి. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చిన అయ్యప్ప భక్తులు సన్నిధానానికి చేరుకోకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. ఈ వార్తి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.