Sabarimala 5 Lakh Insurance :శబరిమల యాత్రీకులకు శుభవార్త. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రీకులు అందరికీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ రాష్ట్ర దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు.
ఈ నెలాఖరులో మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానుంది. కనుక దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సాఫీగా దర్శనం కల్పించేందుకు కొండ గుడి వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
ఆ సౌకర్యం కూడా!
'శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు రూ.5 లక్షల బీమా కల్పిస్తారు. ఒక వేళ యాత్రీకులు చనిపోతే వారి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కూడా దేవస్వం బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది' అని మంత్రి వాసవన్ తెలిపారు.
ఈ సంవత్సరం శబరిమల యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయయ్యాని, శనివారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో దీని గురించి అన్ని విషయాలు చర్చించామని రాష్ట్ర దేవస్వం మంత్రి వాసవన్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 13,600 మంది పోలీసు అధికారులు, 2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని విధుల్లో పెడుతున్నట్లు మంత్రి తెలిపారు.
వైద్య సదుపాయాలు
'యాత్రీకల కోసం పంబ, అప్పాచిమేడు, సన్నిధానం సహా సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్డియాలజీ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అలాగే పాముకాటుకు గురైన వారికి యాంటీ-వెనమ్ చికిత్స కూడా అందించడానికి ఏర్పాట్లు చేశాం' అని మంత్రి వాసవన్ చెప్పారు. అలాగే యాత్రీకులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించేలా టీడీబీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.
20 లక్షల మందికి అన్నదానం
'గతేడాది 15 లక్షల మందికి ఉచిత అన్నదానం చేశాం. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మందికి అయ్యప్ప సన్నిధానంలో ఉచిత అన్నధానం చేస్తాం. అలాగే భక్తుల కోసం అడుగడుగునా తాగు నీటి సౌకర్యాలు కల్పిస్తాం' అని ఆయన తెలిపారు.