Congress CWC Meeting Belgavi : ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై సందేహాలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ సర్కారు వైఖర అందుకు కారణమన్న ఆయన, రాజ్యాంగ సంస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకునేందుకు యత్నిస్తోందని విమర్శించారు. జవహర్‌లాల్ నెహ్రూ, గాంధీ సిద్ధాంతాలు, బీఆర్ అంబేడ్కర్ గౌరవం కోస చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పోరాడుతుందని గురువారం బెళగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పదవులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు.
#WATCH | Congress CWC begins in Karnataka's Belagavi today
— ANI (@ANI) December 26, 2024
Congress president Mallikarjun Kharge, Lok Sabha LoP Rahul Gandhi, Karnataka CM Siddaramaiah along with several other leaders are present here
(Source: AICC) pic.twitter.com/9Q1179ARRX
మహాత్మాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ కర్ణాటక బెళగావిలో ప్రత్యేకంగా సమావేశమైంది. బెళగావిలో జరిగిన కార్యక్రమంలోనే మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగా అదేచోట నవ సత్యాగ్రహ భైఠక్ పేరుతో తాజా సమావేశాన్ని ఆ పార్టీ అధినాయకత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ ఈ సమావేశానికి రాలేదు. వీడియో రూపంలో తన సందేశాన్ని పంపారు. వచ్చే ఏడాది రాజకీయంగా, ఎన్నికల పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాలోచనలు జరిపింది.
'ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పోతోంది'
సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేసిన ఖర్గే- రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అమిత్ షా అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడినప్పటికీ ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం తప్పును ఒప్పుకునే స్థితిలో లేరని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత గౌరవం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థలను సైతం మోదీ సర్కారు నియంత్రిస్తోందని ఆరోపించిన ఖర్గే, అందుకు ఎన్నికల సంఘమే ఉదాహరణ అని పేర్కొన్నారు. మోదీ సర్కార్ వైఖరి కారణంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఖర్గే ఆరోపించారు.
#WATCH | Inside visuals from the Nava Satyagraha Baithak underway in Karnataka's Belagavi
— ANI (@ANI) December 26, 2024
Congress president Mallikarjun Kharge, Lok Sabha LoP Rahul Gandhi, along with several other leaders are present here pic.twitter.com/XMHLCa0vWX
కష్టపడడం మాత్రమే సరిపోదు : ఖర్గే
ఓటరు జాబితాలో పేర్లు ఇష్టారీతిన తొలగించడం, చేర్చడం., పోలింగ్ శాతం ఒక్కసారిగా పెంచడం వంటి అనేక ప్రశ్నలకు ఈసీ సంతృప్తికరమైన సమాధానం చెప్పడం లేదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2025లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న ఖర్గే పార్టీపరంగా ఖాళీలన్నింటినీ భర్తీచేస్తామని ప్రకటించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవారిని గుర్తిస్తామన్న ఆయన వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదన్న ఖర్గే సమయానుకూలంగా నిర్మాణాత్మక వ్యూహరచన, దిశానిర్దేశం కూడా అవసరమేనని పేర్కొన్నారు.
గాంధీ హంతకులను కీర్తించారు : సోనియా గాంధీ
సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఉద్దేశించి సందేశం పంపిన మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మహాత్మాగాంధీ ఎప్పటికీ స్పూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు మహాత్ముడి వారసత్వం, సిద్ధాంతాలను ప్రమాదంలో పడేశారని ఆమె ఆరోపించారు. వాటిని పరిరక్షించేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు దేశ స్వాతంత్ర్యం కోసం ఏనాడూ పోరాడలేదన్న ఆమె మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయని పేర్కొన్నారు. ఆయా సంస్థలు అప్పటి వాతావరణాన్ని కలుషితం చేయడం వల్లే గాంధీజీ హత్యకు దారితీసిందన్నారు. పైగా గాంధీ హంతకులను కీర్తించారని విమర్శించారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.