RSS Ban Removed :ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. గతంలో ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని మునుపటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించింది.
"ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడం సరైన చర్య. ఈ నిర్ణయం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణం, సమాజ సేవలో చురుకుగా పాల్గొంది. జాతీయ భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంఘ్ సహకారం అందించింది. కానీ, మునుపటి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొకుండా నిషేధం విధించారు." అని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ఫైర్
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల తటస్థ భావజాలానికి సవాలుగా మారుతుందని ఆరోపించింది. 1947లో జాతీయ జెండాను దేశం స్వీకరించిందని, అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
"మహాత్ముడి హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని 1966లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. 58 ఏళ్ల తర్వాత మోదీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అన్ని రాజ్యాంగ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎలా వాడుకుంటుందో మాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా మోదీ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులపై సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మార్చాలనే ఆలోచనను ప్రజలు ఓడించడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. మోదీ సర్కార్ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ సాధించడానికి, రాజ్యాంగాన్ని మార్చేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయి."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు