Road Accident In Indore : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ట్రక్కును ఢీ కొనడం వల్ల 8మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఇందౌర్- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కారు టైర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ధార్ జిల్లాకు చెందిన కొందరు ఇందౌర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా ఘటాబిలోడ్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు గుణ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ సైతం ప్రాణాలు విడిచారు. 'మృతదేహాలు కారులో చిక్కుకున్నాయి. గ్రామస్థుల సాయంతో వాటిని అతి కష్టం మీద కారులో నుంచి తీశాం. క్షతగాత్రుడ్ని ఇందౌర్‌లోని ఎంవై ఆస్పత్రికి తరలించాం. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగిస్తాం' అని పోలీసులు తెలిపారు.
ఒడిశాలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి
Road Accident In Odisha : ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు విడిచారు. బుధవారం రెండు ట్రక్కుల మధ్య ఓ కారు ఇరుక్కోవడం వల్ల జరిగిందీ దుర్ఘటన. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం పరీక్షలకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.