RKS Bhadauria Join BJP : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో బీజేపీలోకి చేరికలు వేగాన్ని పుంజుకున్నాయి. ఈక్రమంలోనే భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా బీజేపీలో చేరారు. ఈకార్యక్రమంలో ఆయనతో పాటు తిరుపతి మాజీ ఎంపీ, మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు కూడా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
దేశ నిర్మాణానికి సహకరించేందుకు మరోసారి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు భదౌరియా. 'నేను భారత వాయుసేనలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేశాను. కానీ,నా సర్వీసులో అత్యుత్తమ సమయం మాత్రం గత ఎనిమిదేళ్ల బీజేపీ ప్రభుత్వంలోనిదే. సైన్యం సాధికారత, ఆధునీకరణ, స్వావలంబన కోసం మోదీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల భద్రతా బలగాలు కొత్త సామర్థ్యాన్ని, కొత్త విశ్వాసాన్ని పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే' అని వాయుసేన మాజీ చీఫ్ కొనియాడారు.
'ఆ ఇద్దరి చేరిక గొప్ప విషయం'
ప్రభుత్వ సేవలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు బీజేపీలో చేరడం గొప్ప విషయమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ' దేశ భద్రత, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషిని చూసి వారు బీజేపీలో చేరారు. సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారి 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' డిమాండ్‌ను నెరవేర్చింది కూడా మోదీ ప్రభుత్వమే. ఆర్టికల్ 370ని రద్దు చేసి, దేశ అంతర్గత భద్రతను పెంచారు' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఆర్‌కేఎస్ భదౌరియాను బీజేపీలోకి చేరినందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అభినందించారు.' భదౌరియా భారత వైమానిక దళానికి సుదీర్ఘ కాలం పాటు అంకితభావంతో సేవలందించారు. భారత రక్షణ దళాలలో కీలక పాత్ర పోషించారు. అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తారు. అని వినోద్ తావ్డే ఆశాభావం వ్యక్తం చేశారు.