తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 10:49 PM IST

ETV Bharat / bharat

భారత్​పై హౌతీ దాడుల ఎఫెక్ట్ నో​- ఫ్యాక్టరీలు మూసేస్తున్న ఐరోపా దేశాల్లోని కంపెనీలు!

Red Sea Houthis Attack Effect : ఎర్ర సముద్రంలో జరుగుతున్న హౌతీ రెబల్స్‌ దాడుల ప్రభావం భారత్‌ ముడి చమురు దిగుమతులపై పడలేదని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తెలిపింది. అయితే వాణిజ్య నౌకలను దారి మళ్లించడం వల్ల ప్రయాణ ఖర్చు విపరీతంగా పెరిగిందని వెల్లడించింది. మరోవైపు, ఎర్ర సముద్రంలో నౌకలపై హూతీ రెబెల్స్‌ దాడులు ప్రపంచ దేశాల్లోని వాణిజ్య సంస్థలను కలవరపెడుతున్నాయి. ఉత్పత్తి కేంద్రాలకు రావల్సిన ముడిసరుకులు ఆలస్యం కావడం వల్ల పలు దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Red Sea Houthis Attack Effect
Red Sea Houthis Attack Effect

Red Sea Houthis Attack Effect :ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్‌ చేస్తున్న దాడులు భారత్‌ దిగుమతి చేసుకునే ముడిచమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపలేదని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ పుష్ప కుమార్‌ జోషి తెలిపారు. కానీ నౌకలను దారి మరల్చడం వల్ల వాణిజ్య నౌక ప్రయాణ ఖర్చు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ఎర్ర సముద్రం ద్వారా భారీ మొత్తంలో రష్యా నుంచి భారత్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. 2023 ఏడాదికి గాను భారత్‌ దిగుమతి చేసుకునే మొత్తం పెట్రోలియంలో 35 శాతం రష్యానే సరఫరా చేసింది. అంటే రష్యా రోజుకు 1.7 మిలియన్‌ బ్యారల్ల పెట్రోలియంను భారత్‌కు ఎగుమతి జరిగిందని విశ్లేషకులు తెలిపారు.

ఐరోపా దేశాలపైనే తీవ్ర ప్రభావం!
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఐరోపా దేశాలు రష్యా నుంచి దిగుమతులను నిషేధించాయి. ఫలితంగా రష్యా భారత్‌కు తక్కువ ధరకు ముడిచమురును రవాణా చేస్తోంది. 2023లో HPCL దిగుమతి చేసుకున్న ముడిచమురులో 30 శాతం రష్యా నుంచే వచ్చింది. హౌతీ రెబల్స్‌ దాడులు ఐరోపా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జోషి తెలిపారు. హౌతీ రెబల్స్‌ దాడితో నౌకలు సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి 8 లక్షల 50 వేల డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల వరకు కూడా ఖర్చవుతుందన్నారు. నౌకలు ఆఫ్రికాలోని కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ గుండా ప్రయాణం సాగించడం వల్ల సరకు రవాణాకు అదనంగా 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందన్నారు.

40 అడుగుల కంటైనర్​కు 5వేల డాలర్ల ఖర్చు!
మరోవైపు, ప్రపంచంలో సముద్రం మీదుగా జరిగే సరకు రవాణాలో 25 శాతం ఎర్ర సముద్రం మీదుగానే సాగుతోంది. ఈ క్రమంలోనే గాజాకు మద్దతుగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులు ఒక్కసారిగా ఉద్రిక్తతలను పెంచాయి. ఆ మార్గంలో వాణిజ్య నౌకలను పంపేందుకే అంతా వెనుకంజ వేస్తున్నారు. వీటిని దారి మళ్లించడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడమే కాకుండా ఒక్కసారిగా వేల కిలోమీటర్ల మేర దూరం పెరిగి సరకు రవాణా ఆలస్యమవుతోంది. గతంలో 40 అడుగుల కంటైనర్‌ను ఆసియా నుంచి ఉత్తర ఐరోపాకు పంపాలంటే 1500 డాలర్ల ఖర్చు అయ్యేది. అది ఇప్పుడు 5,500 డాలర్లకు చేరుకుంది.

ద్రవ్యోల్బణం 2 శాతం పెరిగే అవకాశం!
ఆసియా నుంచి కార్గోలు మధ్యధర సముద్రం మీదుగా వెళ్లడానికి గతంలో 2,400 డాలర్ల ఖర్చు అయితే ఇప్పుడు అది 6,800 డాలర్లకు చేరింది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాల్లోని ప్రముఖ వాణిజ్య సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండగా, ఈ పరిణామాలు మరింత ధరల పెరుగుదలకు దారితీయొచ్చని ఫ్లెక్స్‌పోర్ట్‌ సీఈఓ అంచనా వేశారు. హౌతీ రెబల్స్‌ దాడుల వల్ల ద్రవ్యోల్బణం 2 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అంతేకాకుండా దీని ప్రభావం వడ్డీ రేట్లపై పడి నిత్యావసర సరకుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలు బలహీనపడతాయని వారు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 11 వరకు మూసివేత!
హౌతీ దాడుల నేపథ్యంలో కంపెనీలకు ముడి సరకులను వాణిజ్య నౌకలు ఆలస్యంగా చేరవేస్తున్నాయి. వస్తువుల తయారీకి కావాల్సిన ముడి సరకు ఆలస్యం కావడం వల్ల కొన్ని కంపెనీలు తయారీ యూనిట్‌లను నిలిపివేశాయి. సాధారణంగా ఒక వారంలో రావాల్సిన రవాణా నౌక నాలుగు వారాలైనా ఇంకా రాలేదని మాన్‌ అండ్‌ మిషన్‌ కంపెనీ సీఈఓ బ్రౌమాండ్‌ తెలిపారు. బెర్లిన్‌ సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారు టెస్లా సైతం ఈ కారణంగా తమ ఫ్యాక్టరీని సోమవారం నుంచి ఫిబ్రవరి 11 వరకు కూడా మూసివేసింది. చైనా యాజమాన్యం ఆధీనంలో నడుస్తున్న స్వీడిష్‌ కార్ల కంపెనీ వోల్వో కూడా షిప్‌మెంట్‌ ఆలస్యం కావడం వల్ల బెల్జియంలోని తమ అసెంబ్లీ కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

వాహనాల ఉత్పత్తిలో ప్రముఖ కంపెనీ అయిన సుజుకి మోటర్‌ సైతం జపాన్‌లో తమ ఉత్పత్తుల తయారీని వారం రోజుల పాటు నిలిపివేసింది. అమెరికా సుమారు 20 శాతం దుస్తులు, చెప్పులను సూయజ్‌ కెనాల్‌ ద్వారానే దిగుమతి చేసుకుంటోందని అమెరికా ఫుట్‌వేర్‌ అసోషియేషన్‌ సీఈఓ తెలిపారు. ఐరోపాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 40 శాతం దుస్తులను, 50 శాతం బూట్లను ఐరోపా దేశాలు ఎర్రసముద్రం మీదుగానే దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిణామాలు ఐరోపా దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి

పశ్చిమాసియాలో టెన్షన్- మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్ - బ్రిటన్ నౌకపై దాడి

ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్​!

ABOUT THE AUTHOR

...view details