RBI Raises Collateral Free Agricultural Loan Limit :వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే లోన్ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని ఇటీవల రూ.2 లక్షలకు పెంచింది ప్రభుత్వం. 2025 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
పంటల సాగు కోసం అన్నదాతలు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో కేవలం రూ.10 వేలే ఉండగా, క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా దీన్ని రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం- సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నారు అన్నదాతలు. అలాంటివారికి అండగా ఉండేందుకు ఆర్‌బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది.