Delhi Coaching Center Flood : దిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్లో వరద నీటితో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోచింగ్ సెంటర్ బేసిమెంట్ ముంపు ఘటనకు సంబంధించి వీరిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఎం. హర్షవర్ధన్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
ఏడుకి చేరిన అరెస్టైన వారి సంఖ్య
"బేస్మెంట్ యజమాని, భవనం గేటు ధ్వంసం అయ్యేలా వాహనం నడిపిన వ్యక్తి సహా ఐదుగురిని అరెస్ట్ చేశాం. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటాం. కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోని ఒక్కొ అంతస్తు ఒక్కొక్కరిది." అని డీసీపీ ఎం హర్షవర్ధన్ తెలిపారు. కాగా, కోచింగ్ సెంటర్ బేసిమెంట్లోకి వరద నీరు వచ్చిన ఘటనలో ఇప్పటికే రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ భవనం యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య ఏడుకి చేరింది.
భద్రత మరింత కట్టుదిట్టం
మరోవైపు రావూస్ కోచింగ్ సెంటర్ వెలుపల సివిల్స్ ఆశావహులు నిరసనల నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్రనగర్ ప్రాంతంలో పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పారామిలటరీ బలగాలు, అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు.