తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​- 10 సీట్లలో బీజేపీ విజయభేరి, 3స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

Rajya Sabha Election 2024 Results : రాజ్యసభ ఎన్నికల్లో అధికార బీజేపీ సత్తా చాటింది. మొత్తం 15 స్థానాల్లో 10 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 3స్థానాల్లో విజయం సాధించింది. కావాల్సిన సంఖ్యా బలం లేనప్పటికీ క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ హిమాచల్​ప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​లో చెరో ఒక సీటు అదనంగా గెలుచుకుంది. కర్ణాటకలో మాత్రం కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

Rajya Sabha Election 2024 Results
Rajya Sabha Election 2024 Results

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 10:45 PM IST

Rajya Sabha Election 2024 Results :కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో కలిపి మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​కు మూడు సీట్లు దక్కాయి. సమాజ్​వాదీ పార్టీ రెండు స్థానాల్లో విజయదుందభి మోగించింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పలు పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం చూపించింది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా ప్రత్యర్థులు ఓటు వేశారు. కర్ణాటకలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

అదనంగా ఒక సీటు కైవసం చేసుకున్న బీజేపీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్‌ జరగగా బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని నిలిపింది. ఏడుగురు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ వేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్​వాదీ పార్టీ రెండు చోట్ల గెలుపొందింది.

హిమాచల్​లో క్రాస్ ఓటింగ్
కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్‌ సింఘ్వికి నిరాశే ఎదురైంది. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్ విజయం సాధించారు. ఒకే స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ గెలుపొందింది.

హిమాచల్‌ప్రదేశ్‌లో అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టడం వల్ల అక్కడ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 68మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్రులు మూడుచోట్ల గెలిచారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి అభ్యర్థికి ఓటు వేశారు. ఫలితంగా ఇద్దరు అభ్యర్థులకు చెరో 34 ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ బబ్లూ ఓటు చెల్లదని ప్రకటించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గొడవకు దిగారు. చివరకు టాస్‌ ద్వారా బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు EC ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు, రాజ్యసభ ఎన్నికల కోసం విప్‌ జారీ చేశామన్న ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 5-6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఆర్​పీఎఫ్, హరియాణా పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు హిమాచల్ సీఎం.

కర్ణాటకలో కాంగ్రెస్ జోరు
కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్​ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయడం వల్ల కర్ణాటకలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులు అజయ్‌ మాకెన్, సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, GC చంద్రశేఖర్‌ విజయం సాధించారు. బీజేపీ, JDS చెరో చోట పోటీచేయగా JDS అభ్యర్థి ఓటమి పాలయ్యారు. విజయానికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ బీజేపీ-జేడీఎస్ కూటమి ఒక అభ్యర్థిని అదనంగా నిలబెట్టింది. తాజా ఫలితాలతో బీజేపీ- జేడీఎస్ కూటమికి నిరాశ ఎదురైంది.

మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేశారు. మరో బీజేపీ ఎమ్మెల్యే శివరామ్‌ హెబ్బర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తన అత్మ ప్రభోదానుసారం ఓటు వేసినట్లు ఎమ్మెల్యే సోమశేఖర్‌ చెప్పారు. ఆయనది రాజకీయ ఆత్మహత్య అని మండిపడ్డారు బీజేపీ నేత ఆర్‌. అశోక్. సోమశేఖర్​పై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరతామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details