Rajiv Gandhi Assassination Convict Died :మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంథాన్ కన్నుమూశాడు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి, సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022 నవంబర్‌లో విడుదలైన అతడు బుధవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. కాలేయ వైఫల్యంతో అతడు మరణించినట్లు తెలుస్తోంది. ఉదయం 7.50 గంటలకు అతడు ప్రాణాలు కోల్పోయాడు.
"కాలేయ వైఫల్యానికి సంథాన్ చికిత్స తీసుకుంటున్నాడు. తిరుచిరాపల్లిలో స్పెషల్ క్యాంప్ నిర్వహించిన సమయంలో అతడు వైద్యులను సంప్రదించాడు. జనవరి 27న అతడు ఆస్పత్రిలో చేరాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అతడికి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సీపీఆర్ చేసిన తర్వాత అతడిని బతికించాం. ఆక్సిజన్ సరఫరా చేస్తూ వెంటిలేటర్‌పై ఉంచాం. కానీ, చికిత్సకు అతడి శరీరం స్పందించలేదు. ఉదయం 7.50 గంటలకు అతడు తుది శ్వాస విడిచాడు. పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది."
-ఈ తెరనిరాజన్, రాజీవ్ గాంధీ ఆస్పత్రి డీన్
సుప్రీంకోర్టు తీర్పుతో విడుదల
సంథాన్ అలియాస్ సుథేందిరరాజ (55) శ్రీలంకకు చెందిన వ్యక్తి. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన అతడు 3 దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవించాడు. అతడితో పాటు అదే కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురిని సుప్రీంకోర్టు 2022లో విడుదల చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత సంథాన్‌కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. 32 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రిలీజ్ అయ్యాడు.