Railways Detain Connecting Train For Marriage :ఓ వధూవరువుల జంటను కలిపేందుకు రైల్వేశాఖ ఏకంగా ఓ రైలును కొన్ని నిమిషాల పాటు వారి కోసం నిలిపివేసింది. బంగాల్‌లోని హావ్‌డాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబయికి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే వ్యక్తి అసోంలోని గువాహటిలో తన పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ముంబయి నుంచి వయా బంగాల్లోని హావ్‌డా మీదుగా పెళ్లి బృందం గువాహటికి చేరుకోవాలి.
వరుడు చంద్రశేఖర్, అతడి కుటుంబ సభ్యులు మొత్తం 34 మందితో కూడిన పెళ్లి బృందం ఈనెల 14న గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ముంబయి నుంచి హావ్‌డా బయలుదేరారు. తర్వాతి రోజు 15వ తేదీన హావ్‌డాకు చేరుకొని అక్కడ నుంచి సాయంత్రం- 4 గంటల 5 నిముషాలకు బయలుదేరే సరాయ్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటి వెళ్లాల్సి ఉంది. ముంబయి నుంచి బయలుదేరిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్ 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 5 నిముషాలకు హావ్‌డా చేరుకోవాల్సి ఉంది. అయితే, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా గీతాంజలి ఎక్స్‌ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది. గీతాంజలి ఎక్స్‌ప్రెస్ ఆలస్యం కావడం వల్ల తదుపరి రైలును అందుకోలేమని భావించిన వరుడు చంద్రశేఖర్ రైల్వే శాఖను సాయం కోరాడు.
రైలు ఆలస్యం కారణంగా సమయానికి తాము పెళ్లి మండపానికి చేరుకోలేకపోతున్నానని, తన పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని సాయం చేయాలని కోరుతూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా రైల్వే శాఖను కోరాడు. తమ రిజర్వేషన్ టికెట్ల ఫోటోలను దానికి జత చేశాడు. ఇందుకు స్పందించిన రైల్వేశాఖ ఉన్నతాధికారులు హావ్‌డా రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చి సరాయ్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్ రైలును కాసేపు నిలిపివేశారు. సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు గీతాంజలి ఎక్స్‌ప్రెస్ రాగానే వారిని బ్యాటరీ వాహనాల్లో 24వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి 9వ నంబరు ప్లాట్‌ఫాంకు తరలించి, ఆ తర్వాత వారిని సరాయ్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్‌లో అధికారులు ఎక్కించారు. రైలును ఆపకపోతే పెళ్లి తంతు నిలిచిపోయేదని, తమకు సాయం చేసినందుకు పెళ్లి వారు రైల్వేశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవలందించడం తమ నైతిక బాధ్యత అని రైల్వేశాఖ బదులిచ్చింది.