Rahul Gandhi Stopped From Temple Visit :అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అసోంలో శ్రీశ్రీశంకర్ దేవ్ సత్రా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్‌ను కాకుండా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను అనుమతించారు. రాహుల్‌ను హైబోరాగావ్ వద్దే పోలీసులు ఆపేశారు. ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీతో కలిసి పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు.
నాగావ్‌లో ఉన్న ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా తనను అధికారులు అడ్డుకోవడంపై రాహుల్ మండిపడ్డారు. ఎవరు ఆలయాన్ని సందర్శించాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాము ఎలాంటి ఇబ్బందులు సృష్టించాలని అనుకోవడంలేదని రాహుల్ చెప్పారు. ఆలయంలో ప్రార్థనలు మాత్రమే చేస్తామని వివరించారు. ఈరోజు ఒక వ్యక్తి మాత్రమే ఆలయానికి వెళ్లేందుకు అనుమతి ఉన్నట్టుందని పరోక్షంగా మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు.
మధ్యాహ్నం 3 తర్వాతే అనుమతి!
అధికారులు మాత్రం రాహుల్ గాంధీని మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాహుల్ సహా కాంగ్రెస్ నేతలను నాగావ్‌లోని శంకర్ దేవ్ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలోని హైబోరగావ్ వద్దే నిలిపివేశారు. భారీకేడ్లు పెట్టి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
ఆలయ సందర్శన అనుమతి కోసం జనవరి 11 నుంచి ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందుకోసం ఆలయ మేనేజ్మెంట్ను కలిసినట్లు చెప్పారు. 'ఉదయం 7 గంటలకు ఇక్కడికి వస్తామని మేం చెప్పాం. మాకు ఆహ్వానం పలుకుతామని వారు మాకు హామీ ఇచ్చారు. కానీ, నిన్న (ఆదివారం) ఒక్కసారిగా మాకు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్నం 3 వరకు ఆలయానికి రావొద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని జైరాం రమేశ్ ఆరోపించారు.
"ఆలయంలోకి వెళ్లకుండా రాహుల్‌ను ప్రధానమంత్రి, అసోం ముఖ్యమంత్రి అడ్డుకోవడం అవమానకరం. గుడికి వెళ్లి ఎవరు ప్రార్థనలు చేయాలో కూడా మోదీనే నిర్ణయిస్తారా? అయోధ్యలో ప్రధానమంత్రి పూజ పూర్తి చేసేవరకు ఎవరూ ఆలయాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి లేదు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజలు ఎప్పుడు గుడిలో పూజ చేయాలో ప్రభుత్వాలు నిర్ణయించడం ఏంటి?" అని కాంగ్రెస్ సేవా దళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ ధ్వజమెత్తారు.