Assembly Elections 2024 Reactions :మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనూహ్యమని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఫలితాలపై సమగ్రంగా విశ్లేషిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇండియా కూటమికి ఘనవిజయాన్ని కట్టబెట్టినందుకు ఝార్ఖండ్ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.
'సమగ్రంగా విశ్లేషిస్తాం'
ఝార్ఖండ్‌లో ఫలితాలపై మాట్లాడుతూ రాజ్యాంగంతో పాటు నీరు, అడవులు, భూమిపై విపక్ష కూటమి సాధించిన విజయమన్నారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని స్థానిక ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించినందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక పాటుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
పోరాటాన్ని కొనసాగిస్తాం
మహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అసలు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ సిద్ధాంతాలకు తాము నిజమైన ప్రతినిధులమని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఝార్ఖండ్ ప్రజలు తమ హక్కులు, నీరు, అడవులు, భూసమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారని, విభజనవాద, తప్పుడు రాజకీయాలను తిప్పికొట్టారని వ్యాఖ్యనించారు.
సునామీలా విరుచుకుపడింది : ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అస్సలు ఊహించలేదని ప్రతిపక్ష నేత, శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అధికార మహాయుతి ఒక కెరటంలా కాకుండా సునామీలా విరుచుకుపడిందని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా సరే మహారాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు.
'మహా ఫలితాలు ఆశ్చర్యకరం'
మహారాష్ట్ర ఫలితాలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఎన్నికల పారదర్శకతపై తాము ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉంటామని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల్లో పారదర్శకతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఝార్ఖండ్ వాసులు తమ కోసం పనిచేసిన ప్రభుత్వాన్నే గెలిపించారని, విభజనవాద రాజకీయాలను తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.
మీ నమ్మకానికి పొంగిపోయా
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ధన్యవాదాలు తెలిపారు. 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచిన తర్వాత ఆమె, దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్బంగా ప్రియాంకకు ఖర్గే మిఠాయిలు తినిపించి అభినందించారు. తనపై వయనాడ్ ప్రజలు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతతో పొంగిపోయానని ప్రియాంక ఎక్స్‌లో పోస్టు చేశారు.