తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంబానీ-అదానీ నుంచి రాహుల్​కు డబ్బు ట్రక్కులు'- మోదీ వ్యాఖ్యలపై గాంధీ ఫైర్​ - Rahul Gandhi On PM Modi - RAHUL GANDHI ON PM MODI

Rahul Gandhi On PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పందించారు. డబ్బులు తీసుకుని అదానీ-అంబానీలపై మాట్లాడడం లేదన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేాశారు.

Rahul Gandhi On PM Modi
Rahul Gandhi On PM Modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 10:56 PM IST

Rahul Gandhi On PM Modi :అదానీ-అంబానీలపై మాట్లాడడం లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్​ గాంధీ ఎదురుదాడి చేశారు. తనకు ట్రక్కులో డబ్బులు అందించినట్లు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ విషయంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేశారు. ప్రధాని మోదీ తన వ్యక్తిగత అనుభవం గురించి తమకు చెబుతున్నారంటూ విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "మోదీ కొంచెం భయపడుతున్నారు. సాధారణంగా ఎప్పుడూ మూసివేసిన గదుల్లోనే అంబానీ-అదానీ గురించి మట్లాడే మోదీ తొలిసారిగా ప్రజల్లో మాట్లాడారు. టెంపో ట్రక్కులో వచ్చి డబ్బులు ఇచ్చారని చెబుతున్నారు. అది మీ వ్యక్తిగత అనుభవమా? ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించండి. నాకు ఏం భయం లేదు" అని రాహుల్​ గాంధీ అన్నారు.

మోదీ ఏమన్నారంటే
హఠాత్తుగా ఈ ఎన్నికల్లో అంబానీ - అదానీల గురించి మాట్లాడడం రాహుల్‌ గాంధీ మానేశారెందుకని ప్రధాని మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. "మీరు గత ఐదేళ్ల నుంచి కాంగ్రెస్‌ యువరాజును చూడండి. తరచూ అంబానీ-అదానీ పేర్లే చెబుతుంటారు. కానీ, ఎన్నికల ప్రకటన వచ్చిన నాటినుంచి వారిని వెక్కిరించడం మానేశారు. వారి నుంచి ఎంత సొమ్ము తీసుకొన్నారో రాహుల్‌ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. డబ్బు కట్టలతో భారీ వాహనాలు కాంగ్రెస్‌కు చేరుకొన్నాయా. ఏం ఒప్పందం జరిగింది? రాత్రికి రాత్రే వారిని విమర్శించడం ఆపేశావు. మొత్తం మీద కచ్చితంగా ఏదో ఉంది" అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తరచూ ప్రధాని మోదీని విమర్శిస్తూ ఆయనకు అంబానీ-అదానీ సన్నిహితులని, వారి కోసమే పాలసీలు చేస్తారని ఆరోపించేవారు. ఆయన ఎన్నికల ప్రచారాల్లో వారిద్దరే ప్రధాన అజెండాగా ఉండేవి. మంగళవారం కూడా రాహుల్‌ ఝార్ఖండ్‌లో మాట్లాడుతూ ‘భాజపా మీరు వనవాసులని అంటుంది. అటవీ భూములను అదానీకి ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details