Rahul Gandhi Nomination :లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కేరళలోని తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి రెండో సారి బరిలో దిగిన ఆయన, తన నామినేషన్‌ను బుధవారం దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళకు చెందిన ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.
'ఎవరు ఎటువైపు ఉన్నారో మీకు తెలుసు'
నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. "2024 ఎన్నికలు ప్రజాస్వామ్యంతోపాటు భారత రాజ్యాంగం కోసం జరుగుతున్న యుద్ధం. ఒకవైపు మన దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు ఉన్నాయి. మరోవైపు రాజ్యాంగాన్ని పరిరక్షించే కాపాడే శక్తి ఉంది. ఎవరు ఎటువైపు ఉన్నారో మీ అందరికీ చాలా స్పష్టంగా తెలుసు" అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.
వయనాడ్‌లో భారీ రోడ్‌షో
అంతకుముందు వయనాడ్‌లో రాహుల్ గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. దిల్లీ నుంచి ముప్పాయనాడ్ గ్రామానికి హెలికాప్టర్‌లో చేరుకున్న రాహుల్, రోడ్డు మార్గం ద్వారా కాల్‌పెట్ట వరకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాహుల్ రోడ్ షో వయనాడ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. రాహుల్ రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.