Rahul Gandhi Resignation :లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజక వర్గాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రెండు వారాల్లోగా(14 రోజులు) ఆయన దీనిపై నిర్ణయం తీసుకుని తన రాజీనామా లేఖను లోక్‌సభ సభాపతికి పంపించాల్సి ఉంటుందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజకీయ నిపుణుడు పీడీటీ ఆచారి తెలిపారు. ఆ గడువులోగా లేఖను పంపించకపోతే ప్రస్తుతం ఎన్నికైన వయనాడ్ (కేరళ), రాయ్ బరేలీ (ఉత్తర్‌ప్రదేశ్) స్థానాలు రెండింటికీ ఆయన అనర్హులయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా ఉంటే రాహుల్ తన రాజీనామాను ఎన్నికల సంఘానికి పంపవచ్చని ఆచారి తెలిపారు.
'రెండు వారాల్లోగా రాహుల్ ఏదో ఒక సీటుకు రాజీనామా చేయాలి- లేదంటే రెండింటికీ అనర్హత!' - Rahul Gandhi Resign - RAHUL GANDHI RESIGN
Rahul Gandhi Resignation : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల నుంచి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లోగా రాహుల్ ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు తెలిపారు. లేదంటే రెండు స్థానాలకు ఆయన అనర్హులయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Published : Jun 8, 2024, 11:40 AM IST
|Updated : Jun 8, 2024, 11:58 AM IST
కేంద్ర మంత్రి మండలి సిఫార్సుతో జూన్ 5న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 17వ లోక్‌సభను రద్దు చేసినప్పటికీ 18వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్ నియమితులయ్యే వరకు ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా కొనసాగుతారు. ఏ సీటుకు తాను రాజీనామా చేస్తున్నారో తెలుపుతూ జూన్ 18ల తేదీ లోగా రాహుల్ లేఖ రాయాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి గరిష్ఠంగా రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలా
హోరాహోరీగా సాగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎన్డీఏ 292 స్థానాల్లో విజయం సాధించగా, ఇండియా కూటమి 234 చోట్ల గెలుపొందింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ సీట్లకు గండి కొట్టింది ఇండియా కూటమి. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు. ఈ రెండు చోట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ వదులుకున్న సీటుకు మరికొన్నాళ్లలో ఉపఎన్నిక జరగనుంది. అందుకే ప్రజల్లోనూ రాహుల్ రాజీనామా చేయబోయే సీటుపై ఆసక్తి నెలకొంది.