Rahul Gandhi Fires On BJP :మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్షాల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్, నేతలను అరెస్టు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు మోదీ ఒక్కరే తీసుకోవడం లేదు. ఐదుగురు ధనిక మిత్రులతో కలసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంలు వాడకుండా, మీడియాను కొనుగోలు చేయకుండా ఉంటే బీజేపీకి 180 సీట్లకు మించి రావన్నారు. మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆప్ ఆధ్వర్యంలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
"అంపైర్లు, కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చినప్పుడు, ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు, మ్యాచ్ గెలవడాన్ని క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఎన్నికల నేపథ్యంలో అంపైర్లను ఎవరు ఎంపిక చేశారు? మ్యాచ్ ప్రారంభం కాకముందే ఇద్దరు ప్లేయర్ల (ఇద్దరు సీఎంలు)ను అరెస్టు చేశారు. నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నం చేస్తున్నారు. 400 స్థానాల నినాదం ఏదైతే ఉందో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడకుండా, ఈవీఎంలు, సోషల్ మీడియా వాడకుండా, మీడియాపై ఒత్తిడి, కొనుగోలు చేయకుండా సాధ్యం కాదు. వారికి అన్నికలిపి 180సీట్లకు మించి రావు. ఒకవేళ బీజేపీ తన ప్రయాత్నాల్లో సఫలం అయితే, దేశ రాజ్యాంగాన్ని మారుతుంది. దాంతో ప్రజల హక్కులు హరిస్తారు. ఇది మామూలు ఎన్నికలు కావు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఎన్నికలు."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
రాజ్యాంగం ప్రజల గొంతుక అన్న రాహుల్, ఏ రోజైతే అది అంతం అవుతుందో అప్పుడు దేశం కూడా అంతమవుతుందని అన్నారు. రాజ్యాంగం పోతే పేద ప్రజల హక్కులు, రిజర్వేషన్లు కూడా పోతాయని విమర్శించారు. బెదిరింపులతో దేశాన్ని నడిపించొచ్చని వారు భావిస్తున్నారని, మీడియాను కొని అణచివేయవచ్చని కానీ దేశం గొంతుకను అణచివేయలేరని అన్నారు. ఈ ప్రపంచంలో ఏ శక్తి ప్రజల గొంతుకను అణచివేయలేదని చెప్పారు.
"రాముడు సత్యం కోసం పోరాడారు. అప్పుడు ఆయన వద్ద అధికారం లేదు. వనరులు లేవు. కనీసం రథం కూడా లేదు. కానీ రావణుడి రథం వద్ద ఉంది. వనరులు, సైన్యం, బంగారం ఉన్నాయి. రావణుడు బంగారం లాంటి లంకలో ఉండేవాడు. రాముడి వద్ద సత్యం ఉంది. ఆశ, నమ్మకం, ప్రేమ, పరోపకారం, వినయం, ధైర్యం, సాహసం ఉన్నాయి."
--ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
BJP, RSS విషం- వాటిని రుచి చూడొద్దు : ఖర్గే
రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం, ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ, భావజాలాన్ని తొలగించేంత వరకు దేశంలో ముందుకు సాగదని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం వంటివి, వాటిని రుచి చూడవద్దని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు. వారు (బీజేపీ) దేశాన్ని నాశనం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు లేవన్న ఖర్గే, ప్రధాని మోదీ మైదానాన్ని తవ్వి, అక్కడ ప్రతిపక్షాలను క్రికెట్ ఆడమని అడుగుతున్నారని మండిపడ్డారు.