Rahul Gandhi Files Nomination From Raebareli :ప్రధాని పీఠం దక్కించుకోవాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న 80 లోక్ సభ స్థానాలు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ స్థానాన్ని నిలబెట్టుకోవడం, ఉత్తర్ ప్రదేశ్‌లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో రాహుల్ వెంట ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితురులు ఉన్నారు.
రాహుల్‌పై బలమైన నేత పోటీ
2019 వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి దినేశ్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయన కూడా బలమైన నేత. ఈ నేపథ్యంలో రాహుల్‌కు రాయ్ బరేలీలో విజయం నల్లేరు మీద నడక కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ కు దినేశ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, కేరళలో వయనాడ్ లో పోటీ చేసిన రాహుల్‌కు రాయ్ బరేలీలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. దశాబ్దాలుగా హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీలో రాహుల్ విజయంపై ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ కు కంచుకోట, ఈ సారి ఏమవుతుందో?
1952 నుంచి రాయ్ బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి 38 ఏళ్లపాటు కంచుకోటగా ఉంది. ఇందిరా గాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మొదలుకుని సోనియా గాంధీ వరకు అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా వ్యక్తిగత కారణాల రీత్యా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో తన ఆ స్థానంలో ఇప్పుడు రాహుల్ పోటీ చేస్తున్నారు. 1952-2019 వరకు రాయ్‌బరేలీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది.