తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 4:14 PM IST

Updated : Mar 7, 2024, 6:07 PM IST

ETV Bharat / bharat

'మాకు పవర్​ ఇవ్వండి- 30 లక్షల జాబ్స్​ గ్యారెంటీ, యూత్​కు కాంగ్రెస్​ పాంచ్​ పటాకా హామీలు'

Congress Party Election Manifesto : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి అధికారం అప్పచెబితే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రైతుల కోసం కనీస మద్దతు ధరకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని కూడా తెస్తామని రాహుల్ మాట ఇచ్చారు.

Rahul Gandhi Employment Guarantee
Rahul Gandhi Employment Guarantee

Congress Party Election Manifesto :కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. భారత్‌జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా రాజస్థాన్‌ బన్‌స్వారాలోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తామని రాహుల్‌ వాగ్దానం చేశారు.

సంవత్సర అప్రెంటీస్‌షిప్‌ సమయంలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు రాహుల్. ఉద్యోగ నియామకాల కోసం జరిగే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని, అంకుర సంస్థలకు రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని రాహుల్‌ వివరించారు.

'మా మేనిపెస్టోలో ఎమ్​ఎస్​పీ'
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర హామీని కాంగ్రెస్​ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్లు వెల్లడించారు రాహుల్. 'భారత్‌లో తొలిసారి అన్నదాతల కోసం పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని మా మేనిఫెస్టోలో చేర్చాం. అంటే ఎమ్​ఎస్​పీ కోసం చట్టం తీసుకురావాలని నిర్ణయించాం' అని రాహుల్​ చెప్పారు.

"దేశ జనాభాలో 90 శాతం మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలే ఉన్నారు. కానీ వివిధ సంస్థలను చూడండి. దేశ బడ్జెట్‌ను పరిశీలించండి. ఈ వర్గాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా కనిపించదు" అని రాహుల్​ అధికార బీజేపీపై మండిపడ్డారు.

"మన రాష్ట్రపతి ఒక ఆదివాసి. రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. మీరు టీవీల్లో ఆమెను చూశారా? లేదు! ఎందుకంటే ఆమె ఆదివాసి మహిళ కాబట్టి. ఆదివాసి గనుక రాష్ట్రపతి అయినా సరే రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దు అని ఆమెకు నేరుగా సందేశం పంపించారు."
- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

'ఔట్​సోర్సింగ్​ను రద్దు చేస్తాం'
ప్రతి యువ డిప్లొమా, డిగ్రీ హోల్డర్‌కు దేశంలోని ప్రతి ప్రైవేట్​, ప్రభుత్వరంగ సంస్థల్లో అప్రెంటీస్‌షిప్​ శిక్షణ పొందే హక్కు ఉంటుందని రాహుల్​ స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల దేశంలో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారాన్ని ప్రస్తావించిన రాహుల్​, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియను కాంగ్రెస్​ ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు​.​ అంతేకాకుండా ఈ విషయంలో ఔట్​సోర్సింగ్​ వ్యవస్థను సైతం నిలిపివేస్తామని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

యూత్​ కోసం కాంగ్రెస్​ 'పాంచ్​ పటాకా'
Congress Party Election Promises :2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఈ కింది 5 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ​యువ ఓటర్లకు హామీ ఇచ్చారు. 'ఎంప్లాయ్​మెంట్​ రెవల్యూషన్​- ఉపాధి విప్లవం' పేరుతో ప్రకటించిన ఆ వాగ్దానాలు ఏంటంటే..

'భర్తీ భరోసా'
ఈ హామీ కింద పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రణాళిక ప్రకారం అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహిస్తారు.

'తొలి ఉద్యోగం పక్కా'
గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న యువతకు ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలను ఈ హామీ కింద నేర్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'రైట్​ టు అప్రెంటీస్‌షిప్' చట్టాన్ని తీసుకువస్తారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత నైపుణ్యాలు మెరుగుపరచేందుకు స్పెషల్​ అప్రెంటీస్‌షిప్​ ట్రైనింగ్​ కార్యక్రమాలు చేపడతారు.

ఈ శిక్షణ హామీ కింద 25 సంవత్సరాలలోపు డిగ్రీ పాసైన యువతీయువకులకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉచితంగా శిక్షణ​ ఇప్పిస్తారు. ఈ సమయంలో ప్రతి అభ్యర్థికి రూ.లక్ష చొప్పును స్టైఫండ్​ అందిస్తారు. అంటే ఒక వ్యక్తి నెలకు రూ.8,500 భృతి కింద అందుకుంటారు.

'పేపర్​ లీక్​ నుంచి విముక్తి'
ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పేపర్​ లీకేజీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, వాటికి అడ్డుకట్ట పడేలా చేస్తామని కాంగ్రెస్​ 'పేపర్​ లీక్​ సే ముక్తి' పేరుతో హామీ ఇచ్చింది. ప్రశ్నాపత్రాల లీకు వీరులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. ఇందుకోసం ఓ కొత్త చట్టాన్ని కూడా తెస్తామని వెల్లడించింది. అన్ని పరీక్షలను పారదర్శకంగా, పకడ్భందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

'గిగ్‌ కార్మికులకు సామాజిక భద్రత'
ట్రక్, ట్యాక్సీ​ డ్రైవర్లు, మెకానిక్​లు, కార్పెంటర్లు, డెలివరీ బాయ్స్​ ఇలా అనేక రంగాల్లో అసంఘటిత వ్యవస్థలో పనిచేస్తున్న గిగ్​ కార్మికుల కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తెస్తామని ప్రకటించింది. ఇందులో వారికి ముఖ్యంగా సామాజిక భద్రతను కల్పిస్తామని చెప్పింది. ఈ రంగంలో పని చేసేవారికి సంబంధిత కంపెనీలు నిర్దిష్టమైన వేతనాలు ఇచ్చేలా కార్యాచరణను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

'యువ రోషినీ'
ఈ వాగ్దానం కింద బడ్జెట్​లో ఏడాదికి రూ.5వేల కోట్లను కేటాయిస్తారు. ఆ నిధులను దేశంలోని ప్రతి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. వ్యాపార రంగంలో ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు సొంతంగా బిజినెస్​ పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తారు.

కోతిపై గ్రామస్థుల ప్రేమ- సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు

అత్యాచారానికి గురైన ఇద్దరు మైనర్లు ఆత్మహత్య- వారం రోజులకే తండ్రి బలవన్మరణం

Last Updated : Mar 7, 2024, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details