Radhika On Hema Committee Report : మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమకు ఎదురైన వేధింపుల ఘటనలపై నటీమణులు ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో సినీయర్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని రాధిక ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్‌లలో రహస్య కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు.
ఒక మళయాళ సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నారు. 'షాట్ ముగించుకుని తాను వెళ్తుండగా సెట్‌లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్‌లో వీడియోలు చూస్తూ నవ్వుకుంటున్నారు. వెంటనే చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారో తెలుసుకోమని చెప్పాను. కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్‌లో చూస్తున్నారని ఆయన నాకు చెప్పారు. వెంటనే ఈ విషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్‌లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెబుతానని ఆ టీమ్‌ను హెచ్చరించా' అని రాధిక తెలిపారు.
అప్పటి నుంచే కారవాన్ అంటే భయం!
ఆ సంఘటన తర్వాత కారవాన్‌ను ఉపయోగించాలంటే తనకు భయం పట్టుకుందని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఇలా పలు పనులకు సెట్‌లో అదే తమకు వ్యక్తిగత ప్రాంతమన్నారు. అంతేకాదు, చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం దురదృష్టకరమన్నారు. అన్నిచోట్లా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అలాగే హేమ కమీటి రిపోర్టుపై తోటి పురుష నటులు మౌనంగా ఉండడంపై రాధిక మండిపడ్డారు. ఇప్పుడు తమను తాము రక్షించుకునే బాధ్యత నటీమణులపై ఉందన్నారు.